ప్రభుత్వ ఆఫీసు ఉంటేనే అభివృద్ధి చెందుతుందని భావించడం ఒక అపోహ: 'జనసేన' లక్ష్మీనారాయణ

26-12-2019 Thu 16:08
  • మూడు రాజధానులు అంశంపై లక్ష్మీనారాయణ స్పందన
  • అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలని హితవు
  • ప్రజలు కోరుకుంటున్న పాలన ఇవ్వాలని సూచన

ఏపీకి మూడు రాజధానులు అంశంపై జనసేన అగ్రనేత, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. జరగాల్సింది   అధికార వికేంద్రీకరణ కాదని, అభివృద్ధి వికేంద్రీకరణ అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆఫీసు ఉంటేనే అభివృద్ధి చెందుతుందని అనుకోవడం ఒక అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. విశాఖలో సచివాలయం ఏర్పాటు చేస్తే, సచివాలయ భవనాలు వస్తాయని, సిబ్బంది కోసం అక్కడ ఇళ్ల స్థలాలు కేటాయిస్తారని తెలిపారు. సచివాలయ సిబ్బంది కోసం వాహనాలు కూడా సమకూరుస్తారని, అంతకుమించి అక్కడేమీ జరగదని అన్నారు. మరి, సచివాలయం ఏర్పాటు చేస్తే విశాఖపట్నం ఏవిధంగా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.

ప్రభుత్వ ఆఫీసులు ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందుతుంది అనుకుంటే, ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ ఆఫీసు ఏర్పాటు చేస్తే ఎంతో అభివృద్ధి సాధించేవాళ్లం కదా అని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందాల్సింది ప్రభుత్వం కాదని, పరిపాలన అభివృద్ధి చెందాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎక్కువగా కనిపించాలన్న పాత పంథాను వదిలేయాలని, ప్రజలు కోరుకుంటున్న పాలనపై దృష్టిపెట్టాలని హితవు పలికారు.