ఆరు నెలల ముందు నుంచే విశాఖపై వైసీపీ రౌడీలు కన్నేశారు: యనమల ఆరోపణలు

26-12-2019 Thu 16:02
  • కబ్జా భూములను కాపాడుకోవడానికే విశాఖలో రాజధాని
  • ఉత్తరాంధ్రను దోపిడీ కేంద్రంగా చేసే పన్నాగం
  • ఈ విషయాన్ని ఉత్తరాంధ్రవాసులు గ్రహించాలి 

ఆరు నెలల ముందు నుంచే విశాఖపై వైసీపీ రౌడీలు కన్నేశారని, కబ్జా చేసిన భూములను కాపాడుకునేందుకే విశాఖపట్టణంలో రాజధాని ఏర్పాటు చేస్తున్నారని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఉత్తరాంధ్రను దోపిడీ కేంద్రంగా చేసే పన్నాగంలో భాగంగానే విశాఖలో రాజధాని అని మండిపడ్డారు. ఈ విషయాన్ని విశాఖ ప్రజలే కాదు, ఉత్తరాంధ్రవాసులందరూ గ్రహించాలని కోరారు. రాజధాని రైతుల గురించి మాట్లాడుతూ, భూములు ఇచ్చిన రైతులను దొంగలుగా చూస్తారా? అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేబినెట్ మీటింగ్ పేరుతో 29 గ్రామాల్లో అప్రకటిత ఎమర్జెన్సీ తెచ్చారని, రాజధాని గ్రామాల్లో వేలాది మంది పోలీసులను మోహరించారని విమర్శించారు.