సీఎం జగన్ హామీపై కన్నా ఫైర్.. గవర్నర్ కు ఫిర్యాదు

26-12-2019 Thu 15:17
  • దాతలు కళాశాలకు 4 ఎకరాల స్థలం ఇచ్చారు
  • ఆ స్థలాన్ని ముస్లింలకు ఇస్తానని జగన్ హామీ 
  • ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చిన కన్నా

కడప జిల్లా రాయచోటిలో దాతలు ఇచ్చిన  జూనియర్ కళాశాల స్థలాన్ని ముస్లిం ప్రజలకు ఇస్తానని సీఎం జగన్ హామీ ఇవ్వడాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తప్పుబట్టారు. ఈ మేరకు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. విజయవాడలోని రాజ్ భవన్ లో గవర్నర్ ను ఈరోజు కలిశారు.

దాతలు ఇచ్చిన నాలుగు ఎకరాల కళాశాల స్థలాన్ని జగన్ తన ఇష్టానుసారం ధారాదత్తం చేయాలనుకుంటున్నారని గవర్నర్ దృష్టికి తెచ్చారు. అనంతరం, మీడియాతో కన్నా మాట్లాడుతూ, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా పోలీసులను వాడుకుంటోందని ఆరోపించారు. రేపు ఉద్దండరాయునిపాలెంలో గంటపాటు మౌనదీక్ష చేయనున్నట్టు వెల్లడించారు. రాజధానికి ప్రధాని మోదీ  శంకుస్థాపన చేసిన చోట ఈ దీక్ష చేస్తానని చెప్పారు.