గ్రహణం తర్వాత సప్తవర్ణ శోభితుడైన సూరీడు!

26-12-2019 Thu 12:43
  • మూడు గంటలపాటు కొనసాగిన సూర్యగ్రహణం 
  • దేశంలోని పలు ప్రాంతాల వాసుల వీక్షణం 
  • ఆలయాల్లో సంప్రోక్షణలు ప్రారంభం

దాదాపు మూడు గంటలపాటు కొనసాగిన సూర్యగ్రహణం అనంతరం ఆదిత్యుడు సప్తవర్ణ శోభితుడై కనువిందు చేశాడు. ఈరోజు ఉదయం 8.10 గంటలకు ప్రారంభమైన గ్రహణం 11.10 గంటలకు ముగిసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు, ఖగోళ శాస్త్రవేత్తలతోపాటు సామాన్య జనం గ్రహణాన్ని వీక్షించారు. గ్రహణ సమయంలో సూర్యుడుని చంద్రుడు పూర్తిగా కప్పేయడంతో ఏర్పడిన 'రింగ్ ఆఫ్ ఫైర్' 3 నిమిషాల 44 సెకన్ల పాటు కొనసాగగా దాన్ని జనం ఆనందోత్సాహాలతో వీక్షించారు.

భారత్ తోపాటు సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ తదితర దేశాల్లో గ్రహణం కనిపించింది. గ్రహణ వీక్షణం కోసం హైదరాబాద్ లోని బిర్లా ప్లానిటోరియం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రహణం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు మూతపడ్డాయి. గ్రహణం అనంతరం ఆలయాల్లో సంప్రోక్షణలు పూర్తిచేసి తిరిగి తెరిచే పనిలో అర్చకులు పడ్డారు.

గ్రహణం కారణంగా టీటీడీ ఆర్జిత సేవలు రద్దుచేసింది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. అలాగే కాణిపాకం వినాయకుని గుడి, యాదాద్రి లక్ష్మీనృసింహుని ఆలయం, అన్నవరం ఆలయాలు కూడా మధ్యాహ్నం తర్వాత తెరుచుకోనున్నాయి.