Crime News: ఇత్తడిని పుత్తడిగా నమ్మించి అమ్మకం.. ఆరుగురు సభ్యుల ముఠా అరెస్టు

  • పరారీలో మరో నిందితుడు..అంతా ఒడిశా వాసులు
  • శ్రీకాకుళం జిల్లా మందస పరిధిలో మోసానికి తెర 
  • ఓ బాధితుడి ఫిర్యాదుతో వెలుగులోకి మోసం

బంగారం ధర అంతకంతకు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అతి తక్కువ ధరకు బంగారం దొరుకుతోందంటే ఎవరికి ఆశ కలగదు.. సరిగ్గా ఈ బలహీనతనే తమ మోసానికి ఆయుధంగా వాడుకుందో ముఠా. ఇత్తడికి బంగారం పూతపూసి పుత్తడిగా నమ్మించి అమ్మకానికి ఉంచారు. వ్యవహారం బెడిసికొట్టడంతో జైలు పాలయ్యారు. శ్రీకాకుళం జిల్లా మందస ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. 

ఒడిశాలోని గజపతి జిల్లా నువాగడ సమితి తబరాడ గ్రామానికి చెందిన లోహిత్ సింగ్, ఉదయ్ లిమ్మా, అతుల్యకుమారి జెన్నా, విజయానంద్, కె.జాలార్ సింగ గ్రామానికి చెందిన సరిత మాలి, ప్రబుద్ధ ప్రదానో, రాయగడ జిల్లా గుణుపూర్ సమితి పోతాసింగి గ్రామానికి చెందిన వివేకపాణి ఓ ముఠాగా ఏర్పడ్డారు.

మెళియాపుట్టి మండలం అనంతగిరికి చెందిన సవరరాజుకు కొన్ని రోజుల క్రితం వీరితో పరిచయం అయ్యింది. ఇటీవల మందస మండలం కిల్లోయి ప్రాంతంలో ఈ ముఠా రాజును కలిసింది. పాతపరిచయం మేరకు కాసేపు మాట్లాడుకున్నాక బంగారంలా ఉన్న ఐదు కిలోల ఓ లోహపు దిమ్మను రాజుకు చూపించారు. అది బంగారం ఇటుకని, విలువ రూ.14 లక్షలని, అమ్మకానికి పెట్టినట్టు నమ్మబలికారు.

చాలా సేపు బేరసారాలు జరిపిన రాజు చివరికి రూ.4 లక్షలకు దాన్ని కొన్నాడు. ఇంటికి వెళ్లాక దాన్ని పరీక్షించగా అది బంగారం పూతపూసిన ఇత్తడి దిమ్మని తేలడంతో లబోదిబోమన్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ ముఠా పరిసరాల్లోనే ఎక్కడో ఉండి ఉంటుందని భావించిన పోలీసులు విస్తృతంగా గాలించారు. 

ఇదే ముఠా నిన్న నర్సింగపురం పంచాయతీ గండ్రుగాం బస్టాండ్ లో ఇత్తడిని పుత్తడిగా నమ్మించే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఏడుగురు ముఠా సభ్యుల్లో ఆరుగురు చిక్కగా ప్రబుద్ధ ప్రదానో తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు గ్రాముల బంగారం, రూ.1.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

More Telugu News