Arundhati Roy: పక్కా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు.. అందరూ తప్పుడు పేర్లు, చిరునామాలు ఇవ్వండి: అరుంధతి రాయ్

  • ఎన్నార్సీకి ఎన్పీఆర్ ఒక డేటా బేస్ గా ఉపయోగపడుతుంది
  • కేంద్ర ప్రభుత్వ యత్నాలను ప్రజలు తిప్పికొట్టాలి
  • బుల్లెట్లు, లాఠీలను ఎదుర్కోవడానికి మనం పుట్టలేదు

జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)కి జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్) ఒక డేటా బేస్ గా ఉపయోగపడుతుందని ప్రముఖ రచయిత్రి, సామాజికవేత్త అరుంధతి రాయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ యత్నాలను ప్రజలంతా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్పీఆర్ సందర్భంగా అందరూ తప్పుడు పేర్లు, చిరునామాలు ఇవ్వాలని అన్నారు. ఢిల్లీ యూనివర్శిటీలో నిరసనకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ముస్లింలకు వ్యతిరేకంగానే ఎన్నార్సీని తీసుకొస్తున్నారని ఆరోపించారు.

ఎన్పీఆర్ డేటా సేకరణ సందర్భంగా వారు మీ ఇంటికి వస్తారని... మీ పేరు, ఫోన్ నంబర్ తో పాటు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లను అడుగుతారని అరుంధతి రాయ్ చెప్పారు. ఈ సమాచారమే ఎన్నార్సీకి డేటా బేస్ గా ఉపయోగపడుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇదంతా ఒక పక్కా ప్రణాళికతో చేస్తోందని... వారి కుట్రలను మనమంతా ఎదుర్కోవాలని అన్నారు. వారికి తప్పుడు పేర్లను ఇవ్వాలని చెప్పారు. బుల్లెట్లు, లాఠీలను ఎదుర్కోవడానికి మనం పుట్టలేదని అన్నారు.

ఢిల్లీలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని అరుంధతి రాయ్ మండిపడ్డారు. ఎన్నార్సీ ప్రక్రియ ప్రారంభం కాలేదని, దేశంలో ఎలాంటి నిర్బంధ గృహాలు లేవని అసత్యాలు చెప్పారని అన్నారు. దొరికిపోతామని తెలిసి కూడా మోదీ అబద్ధాలు చెప్పారని... ఎందుకంటే ఆయనకు మీడియా సహకారం ఉందని చెప్పారు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారంతా రాష్ట్రాల మద్దతు కోసం ప్రయత్నించాలని... రాష్ట్రాల్లో ఈ చట్టాలను అమలు చేయబోమనే హామీని తీసుకోవాలని సూచించారు.

దేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని... ఎన్నార్సీ, సీఏఏలోని కీలక అంశాలను ఎన్పీఆర్ లో చొప్పించేందుకు యత్నిస్తోందని అరుంధతి అన్నారు. ఉత్తరప్రదేశ్ లో ముస్లింలపై పోలీసులు దాడి చేస్తున్నారని... వారి ఇళ్లకు వెళ్లి లూటీ చేస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News