puducheri: కిరణ్ బేడీ సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారు.. ఆమెను వెనక్కి పిలవండి: రాష్ట్రపతికి పుదుచ్చేరి సీఎం వినతి

  • పాలనా వ్యవహారాల్లో సైంధవ పాత్ర పోషిస్తున్నారు 
  • ఆమెతో కలిసి ప్రభుత్వం నడపడం కష్టం
  • తక్షణం ఆమెను వెనక్కి పిలిపించాలని రాష్ట్రపతికి వినతి

కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై మండిపడ్డారు. రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో ఆమె సైంధవపాత్ర పోషిస్తున్నారని, సమాంతర ప్రభుత్వం నడిపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశంలోనూ అడ్డుపడుతూ ముందుకు వెళ్లనివ్వడం లేదని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెను తక్షణం వెనక్కి పిలిపించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కోరారు.

నారాయణస్వామి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 'గవర్నర్ తీరు ఏం బాగా లేదు. ఆమె ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కేబినెట్ నిర్ణయాలకు అడ్డుపడుతున్నారు. సంక్షేమ పథకాలను ముందుకు వెళ్లనివ్వడం లేదు. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవాలి' అని ఈనెల 23వ తేదీన రాష్ట్రపతికి వినతిపత్రం అందించినట్లు తెలిపారు.

అలాగే పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలని కూడా కోరినట్లు తెలిపారు. కేంద్రం అమల్లోకి తెచ్చిన సీఏఏకి వ్యతిరేకంగా ఈ రోజు లౌకిక పార్టీలతో కలిసి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

More Telugu News