టీడీపీ మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి హఠాన్మరణం.. గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన నేత!

26-12-2019 Thu 07:19
  • ఈ తెల్లవారుజామున గుండెపోటుతో కుప్పకూలిన బుజ్జి
  • విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలింపు
  • అప్పటికే కన్నుమూసిన నేత

ఏలూరుకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఈ తెల్లవారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇంట్లో గుండెపోటుతో కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే విజయవాడలోని ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్టు తెలిపారు. బుజ్జి మరణవార్తతో టీడీపీలో విషాద ఛాయలు అలముకున్నాయి.

బుజ్జిగా చిరపరిచితుడైన ఆయన పూర్తి పేరు బడేటి కోటి రామారావు. దివంగత సినీ నటుడు ఎస్వీ రంగారావుకు ఆయన స్వయాన మేనల్లుడు. 2014-19 మధ్య ఏలూరు ఎమ్మెల్యేగా సేవలు అందించిన బుజ్జి గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పనిచేశారు. బుజ్జి మరణవార్త తెలిసిన అభిమానులు, కార్యకర్తలు, నేతలు ఆసుపత్రికి తరలి వస్తున్నారు.