జగన్ కు దమ్మూ ధైర్యం ఉంటే కేబినెట్ భేటీని సచివాలయంలో నిర్వహించాలి: దేవినేని ఉమ సవాల్

25-12-2019 Wed 21:42
  • రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానిని మారుస్తారా?
  • విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది
  • దీనిపై సీబీఐ ఎంక్వయిరీ వేస్తే మళ్లీ జైలుకు వెళ్లక తప్పదు

ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత  దేవినేని ఉమ సవాల్ విసిరారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ కు దమ్మూ ధైర్యం ఉంటే, మాట తప్పని వాడు, మడమ తిప్పని వాడైతే కనుక ఎల్లుండి నిర్వహించే కేబినెట్ సమావేశాన్ని వెలగపూడిలోని సచివాలయంలో ఏర్పాటు చేయాలని ఛాలెంజ్ చేశారు. అమరావతిని ‘శ్మశానం’ అని, ‘ఎడారి’ అని, ‘పందులు తిరుగుతున్నాయి’ అని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానం దొరకాలంటే కేబినెట్ సమావేశాన్ని సెక్రటేరియట్ లో నిర్వహించాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికే రాజధానిని మారుస్తున్నారని ఆరోపించారు.

విశాఖ భూకుంభకోణానికి సంబంధించి సీబీఐ ఎంక్వయిరీ వేస్తే మళ్లీ జైలుకు వెళ్లక తప్పదంటూ హెచ్చరించారు. విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లో ఎవరైతే భూములు కొనుగోలు చేశారో, గత ఏడు నెలలుగా ఎవరైతే భూ దోపిడీకి పాల్పడ్డారో వాళ్లందరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే రాజధాని అమరావతిలో నిర్వహించే మొదటి కేబినెట్ మీటింగ్ లోనే ఈ నిర్ణయాలు తీసుకుంటామని జగన్ ని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజా రాజధాని అమరావతిలోనే కొనసాగాలని డిమాండ్ చేశారు.