పెళ్లికి నిరాకరించిందని యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది

25-12-2019 Wed 21:10
  • తన ఆఫీసులో పనిచేసే 22 ఏళ్ల యువతిని ప్రేమించిన విక్రమ్
  • స్థానికులు చుట్టుముట్టడంతో తన గొంతు కూడా కోసుకుని ఆత్మహత్యాయత్నం
  • ప్రాణాపాయాన్ని తప్పించుకున్న ఇద్దరూ..

అంతా చూస్తుండగానే.. యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది, చివరికి తన గొంతును కూడా కోసుకుని ఆస్పత్రి పాలయ్యాడు. రాజ్ కోట్ లో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.  విక్రమ్ పాండేసర్ అనే యువకుడు తన ఆఫీసులో పనిచేసే 22 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఈ సందర్భంగా తనని పెళ్లి చేసుకోవాలని కొన్ని రోజులుగా ఆమె వెంటపడుతూ వేధిస్తున్నాడు.

సోమవారం ఆఫీసుకు వెళ్తున్న ఆమెను మార్గమధ్యంలో అడ్డుకుని పెళ్లి చేసుకుంటావా? లేదా? అని అడిగాడు. ఆమె అంగీకరించకపోవడంతో కత్తితో ఆమె గొంతు కోశాడు. అమె రక్తం ఓడుతూ రోడ్డుపై పడి కొట్టుకుంటున్న నేపథ్యంలో  కొంతమంది యువకులు ఆమెను రక్షించి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. స్థానికులు చుట్టుముట్టడంతో విక్రమ్ కూడా తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇద్దరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అయితే, గొంతుపై గాయాల వల్ల మాట్లాడలేకపోతున్నారు. ఇదంతా అక్కడ అమర్చిన కెమెరాల్లో రికార్డయింది. దాన్ని సామాజిక మాధ్యమాలలో ఎవరో పోస్ట్ చేయగా.. నెటిజన్లు ఆ ప్రేమోన్మాదిపై విమర్శల కామెంట్లు కురిపిస్తున్నారు.