మొదటి షెడ్యూల్ షూటింగును పూర్తిచేసిన సుకుమార్

25-12-2019 Wed 18:17
  • స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ సినిమా 
  • కేరళలో ముగిసిన తొలి షెడ్యూల్ 
  • తదుపరి షెడ్యూల్లో జాయిన్ కానున్న బన్నీ  

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ కనిపించనున్నాడని అంటున్నారు. తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగును పూర్తిచేశారు.

ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం, కేరళ అడవుల్లో వారం రోజుల పాటు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఈ షెడ్యూల్లో అల్లు అర్జున్ పాల్గొనలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ సంక్రాంతికి విడుదల కానున్న 'అల వైకుంఠపురములో' సినిమాపైనే దృష్టి పెట్టాడు. అందువలన అల్లు అర్జున్ పాత్రతో సంబంధంలేని సన్నివేశాలను ఇతర నటీనటులపై చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ ను కూడా సుకుమార్ కేరళలోనే ప్లాన్ చేశాడనీ, ఆ షెడ్యూల్లో అల్లు అర్జున్ పాల్గొంటాడని అంటున్నారు.