రాజధాని తరలింపుపై క్లారిటీ లేదు: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

25-12-2019 Wed 17:25
  • అమరావతి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
  • రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
  • రాజధాని అంశం కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉంది

అమరావతి ఎక్కడికీ పోదని... రాజధాని ప్రాంత రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. రాజధానిని మార్చుతారనే వార్తల నేపథ్యంలో రైతులు ఆందోళన చేయడం సహజమని... వారి ఆందోళనను తప్పుపట్టడం సరికాదని చెప్పారు. అమరావతితో పాటు విశాఖ కూడా రాజధానిగా ఉంటుందని తెలిపారు. అమరావతి రైతులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నానని చెప్పారు. ద్వారకాతిరుమలలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాజధాని తరలింపుపై ఇంకా క్లారిటీ రాలేదని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ అంశం ఇంకా కేబినెట్ ఆమోదం పొందాల్సి ఉందని చెప్పారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనేదే ముఖ్యమంత్రి జగన్ ఆలోచన అని అన్నారు.