Sourav Ganguly: బిగ్-3 మోడల్ మాదిరే గంగూలీ ఐడియా ఫ్లాప్ అవుతుంది: పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్

  • నాలుగు దేశాల టోర్నమెంట్ కు గంగూలీ ప్రతిపాదన
  • ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, మరో దేశంతో కలిపి టోర్నమెంట్
  • ఈ ఐడియా ప్రపంచ క్రికెట్ ను నాశనం చేస్తుందన్న లతీఫ్

బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత సౌరవ్ గంగూలీ పలు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. చారిత్రాత్మక డేనైట్ టెస్టు మ్యాచ్ ను కోల్ కతాలో నిర్వహించడంలో గంగూలీ కీలకపాత్ర పోషించారు. తాజాగా గంగూలీ మరో ప్రతిపాదన చేశారు. ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో పాటు మరో దేశంతో కలిపి నాలుగు దేశాల టోర్నమెంట్ ను నిర్వహించాలనేది గంగూలీ ప్రతిపాదన. గంగూలీ ఈ ప్రతిపాదన చేసిన వెంటనే... దానికి అనుకూలంగా, వ్యతిరేకంగా స్పందనలు వస్తున్నాయి. ప్రపంచ క్రికెట్ ను ఈ ప్రతిపాదన నాశనం చేస్తుందని కొందరు అంటున్నారు.

ఈ ప్రతిపాదనపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ స్పందిస్తూ, గంగూలీది ఫ్లాప్ ఐడియా అని చెప్పాడు. బిగ్-3 మోడల్ మాదిరే ఇది కూడా ఫ్లాప్ అవుతుందని తెలిపారు. ఇలాంటి సిరీస్ లను ఆడటం ద్వారా... ఈ నాలుగు దేశాలు ఇతర సభ్య దేశాలను వేరు చేస్తాయని చెప్పారు.

కొన్నేళ్ల క్రితం బిగ్-3 మోడల్ ను ఐసీసీ ప్రవేశపెట్టింది. ఈ మోడల్ లో ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఉండేవి. ఈ మోడల్ కింద ఈ మూడు దేశాలకు ఐసీసీ ఆదాయంలో ఎక్కువ వాటా లభించేది. ఈ మూడు దేశాల ద్వారానే ఐసీసీకి ఎక్కువ ఆదాయం వస్తోందనే కారణంతో... ఇతర సభ్య దేశాల కంటే ఎక్కువ వాటాను ఈ దేశాలకు ఇచ్చేవారు. కొన్నేళ్ల క్రితం ఈ మోడల్ ను ఐసీసీ రద్దు చేసింది.

మరోవైపు, గంగూలీ ప్రతిపాదనపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పందించింది. నాలుగు దేశాల టోర్నమెంట్ పై బీసీసీఐతో చర్చలు జరుపుతున్నామని తెలిపింది.

More Telugu News