అమరావతిలో రేపు వామపక్షాల పర్యటన: సీపీఐ నేత కె.రామకృష్ణ

25-12-2019 Wed 13:26
  • రాజధాని రైతులకు వామపక్షాలు అండగా ఉంటాయి
  • ప్రభుత్వ నియంతృత్వ పోకడలను అడ్డుకొని తీరుతాం
  • అఖిలపక్ష సమావేశం పెట్టి అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకోవాలి

రాజధాని రైతులకు వామపక్షాలు అండగా ఉంటాయని సీపీఐ పార్టీ నేత కె.రామకృష్ణ అన్నారు. తిరుపతిలోని సీపీఐ కార్యాలయంలో తమ పార్టీ 95వ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడారు. సీపీఐ 95వ వార్షికోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని తమ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రేపు ఉదయం 10 గంటలకు విజయవాడ దాసరి భవన్ వద్ద ఎర్రజెండా ఎగరవేయనున్నామని చెప్పారు. అమరావతి రాజధానిపై నెలకొన్న గందరగోళంపై ఆయన స్పందించారు.

ప్రభుత్వ నియంతృత్వ పోకడలను అడ్డుకొని తీరుతామని రామకృష్ణ ప్రకటించారు. ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టి అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతిలో రేపు వామపక్షాల పర్యటన ఉంటుందని ప్రకటించారు. ఇది 29 గ్రామాల ప్రజల ఆందోళన కాదని, ఐదు కోట్ల మంది ప్రజల ఆవేదన అని ఆయన తెలిపారు.