NPR: ఎన్పీఆర్, ఎన్నార్సీ మధ్య తేడా అర్థంకాక చాలా మందిలో గందరగోళం.. అవేంటో తెలుసుకుందాం!

  • ఎన్పీఆర్ జనాభా లెక్కలకు సంబంధించిన రిజిస్టర్
  • ఎన్నార్సీ అనేది పౌరసత్వానికి సంబంధించిన రిజిస్టర్
  • ఈ రెండింటికీ సంబంధం లేదు

ఎన్పీఆర్ (జాతీయ జనాభా పట్టిక), ఎన్నార్సీ (జాతీయ పౌర జాబితా)... ఈ రెండు పదాలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. వీటిపై భారీ ఎత్తున నిరసనలు, చర్చలు కొనసాగుతున్నాయి. మరోవైపు, వీటి మధ్య తేడా అర్థం కాక పలువురు గందరగోళానికి గురవుతున్నారు. ఇవి రెండు కూడా జనాభా లెక్కలకు సంబంధించినవే. అయితే వీటి మధ్య వ్యత్యాసం ఉంది. అదేంటో తెలుసుకుందాం.

ఎన్పీఆర్ (జాతీయ జనాభా పట్టిక):
ఇది దేశంలో నివసిస్తున్న జనాభాకు సంబంధించిన రిజిస్టర్. ఈ పట్టిక కింద ఏదైనా ఒక లోకల్ ఏరియాలో కనీసం ఆరు నెలల నుంచి కానీ అంతకన్నా ఎక్కువ కాలం నుంచి నివసిస్తున్నా... లేదా మరో ఆరు నెలలు కానీ అంతకన్నా ఎక్కువ కాలం కానీ అక్కడే నివసించాలనుకున్నా వారిని అక్కడి స్థానికులుగా గుర్తిస్తారు. లోకల్ ఏరియాలో భాగంగా గ్రామం, సబ్ టౌన్, టౌన్, సబ్ డిస్ట్రిక్ట్, డిస్ట్రిక్ట్, స్టేట్, జాతీయ స్థాయి వరకు వివరాలు ఉంటాయి. దీనికి సంబంధించిన డేటాబేస్ ను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా (కేంద్ర హోం శాఖ) నిర్వహిస్తారు.

ఎన్పీఆర్ ను వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు చేపట్టబోతున్నారు. అసోం మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో ఎన్పీఆర్ ను చేపట్టబోతున్నారు.

ఎన్నార్సీ (జాతీయ పౌర జాబితా):
ఎన్నార్సీ అనేది పూర్తిగా, అధికారికంగా నిర్ధారించబడిన పౌరుల జాబితా. ఇది డిజిటల్ ఫార్మాట్ రిజిస్టర్ రూపంలో ఉంటుంది. ఈ జాబితాలో పేరు ఉన్నవారు మన దేశ పౌరులుగా గుర్తించబడతారు. మన దేశంలో పుట్టినవారు, భారతీయ తల్లిదండ్రులను కలిగిన వారు, కనీసం 11 ఏళ్ల నుంచి మన దేశంలో నివసిస్తున్నవారు భారత పౌరసత్వానికి అర్హులవుతారు.

ఎన్పీఆర్, ఎన్నార్సీ మధ్య తేడా ఏమిటంటే?
2003 డిసెంబర్ 10న విడుదల చేసిన పౌరసత్వ నిబంధనల ప్రకారం... ఎన్పీఆర్ అనేది మన దేశంలో నివసిస్తున్న జనాభాకు సంబంధించిన రిజిస్టర్. ఎన్నార్సీలో ఇండియాలో ఉన్న పౌరుల పూర్తి వివరాలే కాకుండా విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల (ఎన్నారై) వివరాలు కూడా ఉంటాయి.

ఎన్నార్సీలో ప్రతి పౌరుడికి సంబంధించిన ఏయే వివరాలు ఉంటాయంటే?
పేరు:
తండ్రి పేరు:
తల్లి పేరు:
స్త్రీ / పురుషుడు:
పుట్టిన తేదీ:
జన్మించిన ప్రదేశం:
నివాస చిరునామా (ప్రస్తుతం మరియు పర్మినెంట్):
వివాహ వివరాలు (పెళ్లి అయివుంటే భాగస్వామి వివరాలు):
విజువల్ ఐడెంటిఫికేషన్ మార్క్ (పుట్టుమచ్చలు తదితర గుర్తింపులు):
పౌరసత్వ రిజిస్ట్రేషన్ తేదీ:
రిజిస్ట్రేషన్ సీరియల్ నంబర్:
నేషనల్ ఐడెంటిటీ నంబర్:

జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) అనేది పౌరసత్వ నమోదు ప్రక్రియ కాదు. ఏదైనా ప్రాంతంలో ఆరు నెలల కంటే తక్కువ కాకుండా నివసిస్తున్న విదేశీయులు కూడా జనాభా పట్టికలో నమోదు కావచ్చు. ఎన్నార్సీలో కేవలం భారత పౌరులు మాత్రమే ఉంటారు. అక్రమంగా మన దేశంలో నివసిస్తున్నవారికి ఈ జాబితాలో స్థానం ఉండదు. వీరిని అక్రమంగా మన దేశంలోకి చొరబడి, నివసిస్తున్నవారిగా గుర్తిస్తారు. వీరిని దేశం నుంచి వెళ్లగొట్టడం కానీ, నిర్బంధ క్యాంపుల్లో ఉంచడం కానీ చేస్తారు. ఎన్పీఆర్ కేవలం జనాభా లెక్కలకు సంబంధించినది మాత్రమే. ఎన్పీఆర్ కు ఎన్నార్సీకి ఏమాత్రం సంబంధం లేదు.

More Telugu News