కాలేజీ నుంచి బాయ్ ఫ్రెండ్ తో బైకుపై వెళ్లి.. తల్లిదండ్రుల వద్ద 'కిడ్నాప్' డ్రామా ఆడిన అమ్మాయి!

25-12-2019 Wed 12:38
  • మహారాష్ట్రలో ఘటన
  • పోలీసులు, తల్లిదండ్రులను పరుగులు పెట్టించిన అమ్మాయి
  • ప్రియుడితో షికారుకు వెళ్లిందని గుర్తించిన పోలీసులు

బాయ్ ఫ్రెండ్ తో బైకుపై షికారుకు వెళ్లింది.. ఇంటికి వచ్చేసరికి ఆలస్యమైపోయింది.. దీంతో తల్లిదండ్రులు తిడతారని భయపడి, తనను కొందరు అపహరించారని, వారి బారి నుంచి తప్పించుకొని వచ్చానని చెప్పింది. దీంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఆ అమ్మాయి అసత్యాలు చెప్పిందని పోలీసుల విచారణలో తేలింది. మహారాష్ట్రలోని గిట్టిఖాదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ అమ్మాయి (21) బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సాయంత్రం అవుతున్నా కాలేజీ నుంచి ఆమె తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు కంగారు పడ్డారు. చాలా ఆలస్యంగా వచ్చిన ఆమె తనను కిడ్నాప్ చేశారని ఓ కథ చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాలేజీకి వెళుతోన్న తమ కూతురిని నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి, ఓ కారులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్కడి నుంచి తమ కూతురు తప్పించుకొని వచ్చిందని తెలిపారు.
 
దీంతో విచారణ ప్రారంభించిన పోలీసులు... నాగ్ పూర్ క్రైమ్ బ్రాంచ్ బృందంతో కలిసి తనను దుండగులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఆ అమ్మాయి చెబుతోన్న ప్రాంతానికి వెళ్లారు. ఆమెను కూడా తమతో పాటు తీసుకెళ్లారు. అయితే, ఆమె చెబుతోన్న విషయాలకు, చూపిస్తోన్న ప్రాంతానికి పొంతన లేకపోవడంతో ఆమెపై పోలీసులకు అనుమానం వచ్చింది.

దీంతో ఆమె కాలేజీ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఓ బైకుపై వచ్చిన తన ప్రియుడితో ఆమె వెళ్లిందని గుర్తించారు. దీంతో చివరకు ఆ అమ్మాయి తాను కిడ్నాప్ డ్రామా ఆడానని ఒప్పుకుంది.

కాలేజీలో క్లాసులకు హాజరైన తర్వాత బాయ్ ఫ్రెండ్ తో కలిసి నాగ్ పూర్ శివారులోని వాకీ ప్రాంతానికి వెళ్లిందని పోలీసులు తెలిపారు. షికారు ముగిశాక ఆమెను ఆమె బాయ్ ఫ్రెండ్ సెమినరీ హిల్ ప్రాంతంలోని ఆమె ఇంటి సమీపంలో దించి వెళ్లాడని తెలిపారు. దీనిపై తాము ఇప్పటివరకు ఎటువంటి కేసు నమోదు చేయలేదని చెప్పారు.