Cheating: ఘరానా మోసం... 'నోటు'మాటతో లక్షలు నొక్కేసిన వైనం!

  • రూ.500 నోట్లిస్తే రూ.2 వేల నోట్లు ఇస్తామంటూ వల 
  • ఇచ్చిన వారికి 25 శాతం అదనపు డబ్బిస్తామని ఆశ 
  • రూ.15 లక్షలు నొక్కేసిన ముఠా అరెస్టు

'ఆశ మనిషి బలహీనత అయితే ఆ ఆశే మోసగాళ్ల బలం' అనేందుకు ఈ ఘటన చక్కని ఉదాహరణ. రూ.500 నోట్లిస్తే లక్షకు 25 వేల రూపాయలు అదనంగా రూ.2 వేల నోట్లు ఇస్తామంటూ ఓ ముఠా పన్నిన వలలో కొందరు చిక్కుకున్నారు. రూ.15 లక్షలు నొక్కేసిన ముఠా సభ్యులను బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కావలి రూరల్ పోలీసులు తెలిపిన వివరాలు.. 

కావలికి చెందిన గోసుల సుబ్బారెడ్డిని కొన్నాళ్ల క్రితం జనతా పేటకు చెందిన ఉల్లిగడ్డల రాజేష్ కలిశాడు. తమ వద్ద రూ.2 వేల నోట్లు ఎక్కువగా ఉన్నాయని, త్వరలో ప్రభుత్వం వీటిని రద్దు చేస్తుందని చెబుతున్నారని, అందువల్ల వీటిని వదిలించుకునేందుకు ఎవరైనా రూ.500 నోటిస్తే 25 శాతం అదనంగా కలిపి రూ.2 వేల నోట్లు ఇస్తామని ఆశచూపాడు.

ఇదేదో భలే లాభసాటి బేరం అనుకున్న సుబ్బారెడ్డి తొలుత లక్ష రూపాయలు తీసుకువెళ్లాడు. వెంటనే లక్షా ఇరవై ఐదువేల రూపాయలు ఇచ్చారు. అదే సమయంలో మరో 30 లక్షల వరకు తేవాలని అతనికి సూచించారు. దీంతో సుబ్బారెడ్డి తన మిత్రులు కందూరు కాసిరెడ్డి, గుండాల వెంకటేశ్వరరెడ్డిలను సంప్రదించాడు. ముగ్గురూ కలిసి పది లక్షలు తీసుకువెళ్లి ఇచ్చారు.

మిగిలిన 20 లక్షల రూపాయలు తెస్తేనే అదనంగా డబ్బు ఇస్తామని కండిషన్ పెట్టారు. దీంతో వారు నానా కష్టాలుపడి మరో ఐదు లక్షలు సేకరించి వాటిని రాజేష్, అతని స్నేహితులు తుపాన్ నగర్ కు చెందిన కట్టా శ్రీకాంత్, షేక్ నాయబ్ లకు ఇచ్చారు. కానీ రెండు వేలు నోట్లు ఇవ్వలేదు. ఎన్నిసార్లు అడిగినా మిగిలిన 15 లక్షల రూపాయలు తెస్తేనే ఇచ్చేదని తెగేసి చెప్పడంతో మోసపోయామని గ్రహించి కావలి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు మోసగాళ్లను అరెస్టు చేశారు. అయితే ఈ ముగ్గురి వెనుక అనంతపురానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి సూత్రధారిగా ఉన్నాడని, సుబ్బారెడ్డికి నాగరాజు ద్వారానే రాజేష్ పరిచయం అయ్యాడని తేల్చారు. నాగరాజును అరెస్టుచేసి మిగిలిన సొమ్ము రికవరీ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

More Telugu News