వాహనచోదకులకు బ్రేక్... బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ పై వేగ నియంత్రణ చర్యలు

25-12-2019 Wed 10:24
  • నిపుణుల కమిటీ సూచనల మేరకు పనులు చేపట్టిన హెచ్ ఆర్ డీసీ
  • గతనెల 23న కారు ప్రమాదంతో అప్రమత్తం 
  • అప్పటి నుంచి మూసివేసి ఉన్న వంతెన

రాయదుర్గం బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్... హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో ఉన్న దీని పేరు వినగానే గతనెల 23వ తేదీన అతివేగంగా వచ్చిన కారు అదుపుతప్పి అరవై మీటర్ల ఎత్తు నుంచి కింది రోడ్డుపై పడిన విషయం గుర్తుకు వస్తుంది. స్థానికంగా భయాందోళనలకు గురిచేసిన ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే చనిపోగా, మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. కారు డ్రైవర్ సహా మరొకరు కూడా గాయపడ్డారు. తరచూ ఈ  ఫ్లై ఓవర్ పై ఏదో రూపంలో ప్రమాదాలు ఎదురు కావడం, 23వ తేదీ ప్రమాదం తీవ్ర సంచలనం రేపడంతో హైదరాబాద్ రోడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (హెచ్ ఆర్ డీసీ) అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

ఘటనానంతరం ఫ్లై ఓవర్ మూసివేశారు. ప్రమాదాల నివారణకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు పలు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా వంతెన సమీపించేందుకు ముందు, వంతెన ప్రారంభమయ్యాక మందమైన తెలుపు చారలతో స్పీడ్ బ్రేకర్లు లాంటివి ఏర్పాటు చేశారు.

వీటి పైనుంచి వాహనం వెళ్లేటప్పుడు చిన్నపాటి కుదుపులకు లోనవుతుంది. దీనివల్ల వాహన చోదకుడు అప్రమత్తమవుతాడు. అలాగే, స్పీడ్ లిమిట్ (40 కి.మీ) తెలియజేస్తూ హెచ్చరిక బోర్డులు పెట్టారు. రక్షణ గోడ ఆసాంతం ఎక్కడికక్కడే ఈ బోర్డులు వేలాడదీశారు.

వంతెనకు ఓవైపు ఉన్న మలుపు వద్ద రక్షణ గోడ ఎత్తు పెంచాలని కమిటీ సూచించింది. ఈ గోడ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉందని, ఈ పని పూర్తయ్యాక మళ్లీ వంతెన తిరిగి తెరిచేది ఎప్పుడనేది నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు.