Vijay Rupani: ముస్లింలకు 150 దేశాలున్నాయి... హిందువులకు మాత్రం ఒక్కటే ఉంది: గుజరాత్ సీఎం విజయ్ రూపానీ

  • 1947లో పాక్ లో 22 శాతం హిందువులు
  • హింస, అత్యాచారాల కారణంగా మిగిలింది 3 శాతమే
  • అహ్మదాబాద్ ర్యాలీలో విజయ్ రూపానీ

ఇండియా నుంచి వెళ్లిపోవాలనుకుంటే, ముస్లింలకు 150 దేశాలు ఉన్నాయని, హిందువులకు ఉన్నది మాత్రం ఒక్క ఇండియా మాత్రమేనని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ లోని సబర్మతీ ఆశ్రమంలో జరిగిన ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన, సీఏఏ (సిటిజన్ షిప్ అమెండ్ మెంట్ యాక్ట్ - పౌరసత్వ సవరణ చట్టం)ను ప్రస్తావించారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పై మండిపడ్డారు. మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయాలను గౌరవించడం లేదన్నారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, ఈ విషయంలో తప్పుదారి పట్టిస్తోందని రూపానీ ఆరోపించారు.

1947లో దేశం విడిపోయినప్పుడు పాకిస్థాన్ లో 22 శాతం మంది హిందువులు ఉండేవాళ్లని, ఇప్పుడు కేవలం 3 శాతం మాత్రమే మిగిలారని ఆయన గుర్తు చేశారు. కేసులు, అత్యాచారాలు, హింసను తాళలేక, లక్షలాది మంది హిందువులు పాక్ ను వీడారని చెప్పారు. ఇండియాకు తిరిగి వస్తున్న హిందువుల కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలచుకున్నదో, దాన్నే తాము ముందుకు తీసుకుని వెళుతున్నామని, ఇప్పుడు ఆ పార్టీవారే కావాలని వ్యతిరేకిస్తున్నారని నిప్పులు చెరిగారు.

ప్రస్తుతం బంగ్లాదేశ్ లో 2 శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారని, కొన్ని దశాబ్దాల క్రితం ఆఫ్ఘనిస్థాన్ లో 2 లక్షల మంది హిందువులు ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 500కు పరిమితమైందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 150 ముస్లిం చేశాలున్నాయని, హిందువులకు మరే దేశమూ లేదని, హిందువులు వలస వెళ్లాలనుకుంటే మిగిలింది ఇండియా మాత్రమేనని విజయ్ రూపానీ చెప్పుకొచ్చారు.

More Telugu News