driver: డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరి.. కొత్త బస్సును కొట్టేసిన ప్రబుద్ధుడు!

  • జైలుకు వెళ్లొచ్చినా మారని బుద్ధి 
  • కొత్త భారత్ బెంజ్ బస్సును చోరీ చేసిన ఘనుడు
  • ఆమన్‌గల్‌లో గుర్తించిన  పోలీసులు

బస్సును చోరీ చేసేందుకు డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరిన నిందితుడు పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్, ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేటలోని కేటీ అన్నారానికి చెందిన నిమ్మల యాదగిరి (37) నకిరేకల్‌లో నివసిస్తున్నాడు. పదో తరగతి వరకు చదువుకున్న యాదిగిరి డ్రైవర్‌గా మారాడు. అయితే, డబ్బులు సరిపోకపోవడంతో దొంగతనాలు మొదలుపెట్టాడు. 2013లో సిమెంటు బస్తాల లోడుతో ఉన్న లారీని చోరీ చేసిన కేసులో జైలుకు కూడా వెళ్లొచ్చాడు. అయినప్పటికీ బుద్ధి మాత్రం మార్చుకోలేదు.

బాలపూర్‌కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ వెంకటేశ్వరరావు వద్ద డ్రైవర్‌గా చేరాడు. అతడు కొనుగోలు చేసిన కొత్త భారత్ బెంజ్ బస్సు డ్రైవింగ్ బాధ్యతలు చేపట్టాడు. వెంకటేశ్వరరావు ఇటీవల వైజాగ్ వెళ్తూ బస్సును ఎల్బీనగర్ సమీపంలోని చింతకుంట వద్ద పార్క్ చేసి తాళాలను తన కుమారుడికి ఇవ్వాలని చెప్పాడు. సరేనన్న యాదగిరి ఆదివారం రాత్రి బస్సుతో ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకున్నాడు.

అనంతరం యజమానికి ఫోన్ చేసి బస్సును పార్క్ చేశానని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఆ వెంటనే బస్సును తీసుకుని శ్రీశైలం రోడ్డులో బయలుదేరాడు. బస్సు జాడ లేకపోవడంతో సోమవారం నగరానికి చేరుకున్న వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమన్‌గల్‌లో రోడ్డుపై ఉన్న బెంజ్ బస్సును గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News