Thaneshwar Singh: పోలీసులకు చిక్కిన జేబుదొంగ... అతని ఆస్తులను చూసి విస్తుపోయామన్న సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ!

  • 400కు పైగా దొంగతనాలు చేసిన థానేదార్ సింగ్ కుశ్వ
  • రూ. 30 వేల అద్దె, భార్యకు కిలో బంగారు ఆభరణాలు
  • నెల రోజులు మాటేసి పట్టేసిన రైల్వే పోలీసులు

పోలీసులకు పట్టుబడేసరికి అతను ఓ చిన్న జేబుదొంగ. రాత్రుళ్లు రైళ్లు టార్గెట్ గా చేసుకుని, చేతిలో చిన్న బ్లేడుతో సంచరిస్తూ, అందినంత దోచుకుంటుంటాడు. అతని పేరు థానేదార్ సింగ్ కుశ్వ అలియాస్ రాజు. వయసు 33 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ జిల్లా అర్ణి ప్రాంతానికి చెందిన వ్యక్తి. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు, విచారించిన తరువాత అతని బ్యాక్ గ్రౌండ్, లగ్జరీని చూసి అవాక్కయ్యారు. స్వయంగా సికింద్రాబాద్ ఎస్పీ అనూరాధ ఇతని లైఫ్ స్టయిల్ ను చూసి విస్తుపోయారు.

చందానగర్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నెలకు రూ. 30 వేలు అద్దె ఇస్తూ, నివసిస్తున్న రాజు, తన ఇద్దరు పిల్లలనూ లక్షల ఫీజు చెల్లించి, ఓ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదివిస్తున్నాడు. లెక్కలేనన్ని ఆస్తులున్నాయి. భార్యకు కిలోకు పైగానే బంగారు ఆభరణాలున్నాయి. పోలీసులు ఇంటికి వెళ్లిన సమయంలో నగదు రూపంలోనే రూ. 13 లక్షలు దొరికింది. చోరీ సొమ్ముతో అత్యంత జల్సా జీవితాన్ని గడుపుతున్నాడీ ఘరానా దొంగ.

ఇక ఇతను చేసిన నేరాల సంఖ్య 400కు పైగానే. చిన్న వయసులో రైల్వే ప్లాట్ ఫారాలపై స్వీట్లు విక్రయిస్తూ, ఆపై సిగరెట్లు, తంబాకు వ్యాపారానికి మారాడు. తనకు పరిచయమైన జేబు దొంగలను చూసి, రైళ్లలో చోరీకి అలవాటు పడ్డాడు. 2006లో బ్లేడ్ తో జేబులు కత్తిరించడంలో సిద్ధహస్తుడైన చంద్రకాంత్ తో ఏర్పడిన పరిచయం అతన్ని మార్చివేసింది. 2007లో ఓ మారు పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. ఆపై 2009 వరకూ సంపాదించిన డబ్బుతో ఆగ్రాలో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి, అదే సంవత్సరం పెళ్లి చేసుకుని తిరిగి హైదరాబాద్ కు వచ్చాడు.

ఇక రాజు పట్టుబడిన విధానం కూడా సినీ పక్కీలోనే జరిగింది. గత నెల 26న బేగంపేట రైల్వే స్టేషన్ వద్ద అతను నిలబడివుండగా, ఆర్పీఎఫ్ పోలీసులు అనుమానం వచ్చి వివరాలు తెలుసుకునేందుకు వెళ్లారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో తన బైక్ ను అక్కడే వదిలేసి పరిగెత్తాడు. ఈ క్రమంలో కిందపడడంతో, అతని ఎడమచేయి విరిగింది. అయితే, నెల రోజులుగా బైక్ అక్కడే ఉండటంతో పోలీసులు దానిపై దృష్టి పెట్టారు. సోమవారం నాడు మరో వ్యక్తి సాయంతో బైక్ ను తీసుకెళ్లేందుకు బేగంపేటకు వచ్చిన రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వాహనం కూడా దొంగిలించినదేనట.

అన్నట్టు మహారాష్ట్రలోని పూణెలో ఓ మారు పట్టుబడిన రాజును, ఎరవాడ జైలుకు తరలించగా, ముంబై పేలుళ్ల దోషి అజ్మల్ కసబ్ ను ఉరి తీసిన సమయంలో అక్కడే ఉన్నాడట.

More Telugu News