CAA: వాళ్లపైనే దేశం ఆధారపడలేదు: కంగనకు మనీశ్ సిసోడియా కౌంటర్

  • సీఏఏ నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్న కంగన
  • పన్ను చెల్లిస్తున్న 3 శాతం మందిపై దేశ ప్రజలు ఆధారపడి ఉన్నారన్న నటి
  • బస్సుల్ని, రైళ్లను దగ్ధం చేసి, హింసాయుత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆక్షేపణ

సీఏఏపై చెలరేగుతున్నఆందోళనల నేపథ్యంలో బాలీవుడ్ తార కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా దీటుగా సమాధానమిచ్చారు. తాను నటించిన ‘పంగా’ సినిమాకు సంబంధించి నిన్న ట్రైలర్ విడుదల కార్యక్రమంలో కంగన సీఏఏకు వ్యతిరేకంగా కొన్ని వర్గాలు చేపట్టిన నిరసనలపై మాట్లాడారు.

‘ఆందోళన హింసాత్మకంగా ఉండకూడదు. మనదేశంలో కేవలం మూడు నుంచి 4 శాతం మంది ప్రజలు మాత్రమే పన్ను కడుతున్నారు. మిగిలిన వ్యక్తులు వీరిపైన ఆధారపడుతున్నారు. కాబట్టి బస్సుల్ని, రైళ్లను దగ్ధం చేసి, దేశంలో ఇలాంటి వాతావరణాన్ని సృష్టించే హక్కు ఎవరిచ్చారు? ఒక్కో బస్సు ధర రూ.80 లక్షల వరకు ఉంటుంది. అది తక్కువ మొత్తం కాదు’ అని అన్నారు.

పన్నులు అందరూ కడుతున్నారు!

కంగన వ్యాఖ్యలకు మనీశ్ సిసోడియా సామాజిక మాధ్యమంగా స్పందిస్తూ.. ‘హింస, ప్రభుత్వ ఆస్తిని నాశనం చేయడం తప్పు, అది చట్ట విరుద్ధం. కానీ.. ఈ దేశం, మూడు శాతం మంది ప్రజలు చెల్లించే పన్నుపై మాత్రం ఆధారపడలేదు. దేశంలోని ప్రతి ఒక్కరు పన్ను చెల్లిస్తున్నారు. పేదవాడి నుంచి సంపన్నుడి వరకు అందరూ ఏదో ఒక రూపంలో పన్ను కడుతున్నారు. కూలిపని చేసేవారు కూడా పన్నులు కడుతున్నారు. ఉప్పు లాంటి చౌక వస్తువులు వారు కొనడం తప్పనిసరి.. వాటిపై పన్ను చెల్లిస్తున్నారు. సినిమా చూడటానికి వెళ్లినా నటీనటులకోసం కొంత వినోదపు పన్ను రూపంలో చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఆలోచించూ ఎవరు ఎవరిపై ఆధారపడుతున్నారో?’ అని చురక అంటించారు.

More Telugu News