vice-president: నేను బహిరంగంగా మాట్లాడలేను.. మీరందరూ అర్థం చేసుకోవాలి!: రైతులతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

  • నేను రాజకీయంలో లేను.. ప్రభుత్వంలో లేను
  • బహిరంగంగా మాట్లాడేందుకు లేదు
  • ఏదైనా వినతిపత్రం ఇవ్వదలచుకుంటే ఇవ్వండి

ఏపీ రాజధాని అమరావతి తరలించవద్దంటూ ఆ ప్రాంత రైతులు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఏపీ రాజధాని ప్రాంత రైతులు కలిశారు. కృష్ణా జిల్లాలోని ఆత్కూరులో వెంకయ్యనాయుడుని కలిసిన రైతులు తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. రాజధాని అమరావతిని తరలించవద్దని కోరుతూ ఆయనకు ఓ వినతిపత్రం సమర్పించారు. అనంతరం, వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ‘నేను రాజకీయంలో లేను. ప్రభుత్వంలో లేను. బహిరంగంగా మాట్లాడడానికి లేదు’ అని, ఈ విషయాన్ని రైతులందరూ అర్థం చేసుకోవాలని సూచించారు.

‘మీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ, ఏ పదవిలో ఉన్నవాళ్లు ఏం చేయాలనేది మీరందరూ అర్థం చేసుకోవాలి’ అని కోరారు. అసలు అయితే, రైతులను కలవనని చెప్పాను కానీ, ‘నాకు బాధ అనిపించింది.. కలిస్తే సమస్యలు.. ఏదైనా మాట్లాడారనుకోండి వివాదం. ఇప్పుడు ప్రతి ఒక్కటీ రాజకీయ దృష్టితో చూస్తున్నారు’ అని అన్నారు. రాజధానిగా అమరావతిలో శంకుస్థాపన చేశామని, అందులో పాల్గొన్నానని, రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారన్న దానితో పాటు అన్ని విషయాలు తనకు తెలుసని అన్నారు.

ఏదైనా వినతిపత్రం ఇవ్వదలచుకుంటే ఇవ్వండి చూస్తానని, తాను ఏం చేయగలనో, ఎలా చేస్తే మంచి జరుగుతుందో.. తన వంతు కృషి చేస్తానని అన్నారు. తెలుగు రాష్ట్రాలకు దేశానికి ఏది అవసరమో, ఎప్పటికప్పుడు ఎవరికేమి చెప్పాలో వాళ్లకు చెబుతానని అన్నారు. ‘నేను చేయగలిగిందేదో చేస్తాను, దయచేసి, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి’ అని కోరారు.

More Telugu News