ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులెత్తేసింది: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్

24-12-2019 Tue 18:05
  • ఎన్నికల షెడ్యూల్ పై పీసీసీ చీఫ్ ఉత్తమ్ కోర్టుకు వెళతాననడం విడ్డూరం
  • కాంగ్రెస్ ఓటర్లను కాకుండా కోర్టులనే నమ్ముకున్నట్లుంది
  • ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ విజయం ఖరారైంది

రానున్న మునిసిపల్ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ కర్నె ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలంటేనే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి భయం కలుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ రోజు కర్నె ప్రభాకర్ సహచర ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, శంబీపూర్ రాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్ ను తప్పుబడుతూ కోర్టుకు వెళతామంటూ ఉత్తమ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కాంగ్రెస్ ఓటర్లను కాకుండా కోర్టులనే నమ్ముకున్నట్లు అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ఉత్తమ్ వ్యవహరిస్తున్న తీరుతో కాంగ్రెస్ ను టికెట్ అడిగేవారే కరవయ్యారని ఎత్తి పొడిచారు. ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ విజయం ఖరారైందన్నారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పిస్తోందని మరో ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ అన్నారు. లోకాయుక్త, మానవ హక్కుల సంఘాలకు బీసీ, ఎస్సీ వర్గాల నుంచి నియామకాలు జరపడం తమ చిత్తశుద్ధికి తార్కాణమని పేర్కొన్నారు.