రాజధానిని తరలించొద్దు.. కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం కావాలి: ప్రత్తిపాటి పిలుపు

24-12-2019 Tue 16:18
  • ఎమ్మెల్యేలు త్యాగాలకు సిద్ధమైతే రాజధాని ఇక్కడే ఉంటుంది
  • వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే చరిత్రలో నిలిచిపోతారు
  • రైతుల త్యాగాలను వైసీపీ ప్రభుత్వం మర్చిపోయింది

రాజధాని అమరావతిని తరలించవద్దని, కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం కావాలని టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పిలుపు నిచ్చారు. గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు త్యాగాలకు సిద్ధమైతే రాజధాని ఇక్కడే ఉంటుందని అన్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే చరిత్రలో నిలిచిపోతారని, వారు కనుక రాజీనామాలు చేస్తే ఆయా స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను పోటీకి కూడా నిలబెట్టమని సూచించారు. రాజధాని విషయమై ప్రజల్లో ఉద్యమస్ఫూర్తి నింపాలని అన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను వైసీపీ ప్రభుత్వం మర్చిపోవడం దారుణమని, వారి మనసులను సీఎం జగన్ గాయపరిచేలా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అమరావతి ఉన్నంతకాలం భూములిచ్చిన రైతుల త్యాగాలను మర్చిపోరని అన్నారు.