అమృత తండ్రి మారుతీరావుకు మరోమారు బెయిల్ మంజూరు

24-12-2019 Tue 12:49
  • పరువు హత్య చేయించిన మారుతీరావు
  • బెయిల్ పై బయటకు వచ్చి కుమార్తెకు బెదిరింపులు
  • అరెస్ట్ చేసి జైలుకు పంపగా, షరతులతో రెండోసారి బెయిల్

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన ప్రణయ్ హత్య కేసులో అమృత తండ్రి మారుతీరావుకు నల్గొండ జిల్లా 8వ అదనపు న్యాయమూర్తి జగ్జీవన్ కుమార్ బెయిల్ ను మంజూరు చేశారు. తన కుమార్తె అమృత, తక్కువ కులానికి చెందిన ప్రణయ్ ను ప్రేమ వివాహం చేసుకుందన్న ఆగ్రహంతో, మారుతీరావు కిరాయి రౌడీలతో మిర్యాలగూడలోని ఓ ఆసుపత్రి ముందు ప్రణయ్ ను దారుణంగా చంపించాడు. ఈ కేసులో మారుతీరావును పోలీసులు అరెస్ట్ చేయగా, గత నెలలో తొలిసారి బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. ఆపై అమృత ఇంటికి తన మనుషులను పంపించిన మారుతీరావు, హత్య కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరించాడు.

ఈ ఘటనపై అమృత మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేయగా, మారుతీరావును అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో మారుతీరావు బెయిల్ కు దరఖాస్తు చేసుకోవడంతో రూ. 20 వేల షూరిటీ, రెండు నెలల పాటు ప్రతి బుధవారం మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య పోలీసు స్టేషన్ కు హాజరై, సంతకం చేయాలని షరతులు విధించి, మరోమారు ఇటువంటి బెదిరింపులు చేయరాదని హెచ్చరిస్తూ, న్యాయమూర్తి బెయిల్ ను మంజూరు చేశారు.