రాహుల్ గాంధీకి కీలక సూచన చేసిన ప్రశాంత్ కిశోర్

24-12-2019 Tue 11:41
  • సీఏఏ, ఎన్నార్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలకు మద్దతివ్వడం సంతోషకరం
  • కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నార్సీని అమలు చేయబోమని ప్రకటించాలి
  • రాహుల్ ప్రకటన మరింత ప్రభావం చూపుతుంది

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ కీలక సూచన చేశారు. పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర జాబితాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు రాహుల్ మద్దతివ్వడం సంతోషకరమని పీకే అన్నారు. అయితే, ఇది మాత్రమే సరిపోదని... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వీటిని అమలు చేయబోమని రాహుల్ అధికారికంగా ప్రకటించాలని సూచించారు. ఈ మేరకు రాహుల్ ప్రకటిస్తే... అవి మరింత ప్రభావం చూపుతాయని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

ఎన్నార్సీని రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించేందుకు ప్రయత్నించినా... కేంద్రం దాన్ని అమలు చేస్తుందని పార్లమెంటులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారని... ఆ ప్రకటన నిజమయ్యే అవకాశాలే లేవని పీకే అన్నారు. పార్లమెంటులో సీఏబీకి వ్యతిరేకంగా ఓటు వేసినంత మాత్రాన సరిపోదని... రాష్ట్రాల్లో ఎన్నార్సీని అమలు చేయబోమని రాష్ట్రాలు విస్పష్టంగా ప్రకటించాలని చెప్పారు.