ఇండియా తక్షణ చర్యలకు ఉపక్రమించాలి!: ఐఎంఎఫ్ కీలక వ్యాఖ్యలు

24-12-2019 Tue 10:44
  • ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టాలి
  • పెట్టుబడులు పెరిగేందుకు చర్యలు చేపట్టాలి
  • ఆర్బీఐ వడ్డీ రేట్లను మరింతగా తగ్గించాలి
  • తన వార్షిక నివేదికలో అంతర్జాతీయ ద్రవ్యనిధి

భారత ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కోరింది. ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియాలో పెట్టుబడులు తగ్గాయని, పన్ను ఆదాయం పడిపోయిందని, ప్రజలు ఖర్చు పెట్టడం తగ్గించారని, ఇవన్నీ వృద్ధి రేటుపై ప్రభావితం చూపిస్తున్నాయని, తన వార్షిక నివేదికలో ఐఎంఎఫ్ పేర్కొంది.

ఇండియాలో పేదరికం నుంచి లక్షల మంది ప్రజలు బయటకు వచ్చినప్పటికీ, వృద్ధి రేటు విషయంలో దారుణంగా వెనుకబడిందని ఐఎంఎఫ్ ఆసియా పసిఫిక్ విభాగం ప్రతినిధి రనిల్ సల్ గాడో వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, భారత ప్రభుత్వం తక్షణమే విధాన పరమైన నిర్ణయాలను తీసుకోవాలని, ఆర్థిక మందగమనాన్ని నిరోధించి, అధిక వృద్ధికి బాటలు వేసేలా ఇవి ఉండాలని అభిప్రాయపడ్డారు. అయితే, అధికంగా ఉన్న వడ్డీలు ప్రజలను వెనుకంజ వేయిస్తున్నాయని, వృద్ధి రేటు తగ్గిపోవడానికి అది కూడా కారణమని అన్నారు. వృద్ధి రేటు మరింతగా తగ్గుతుందన్న ఆందోళన నెలకొన్నందున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింతగా వడ్డీ రేట్లను తగ్గించాలని ఆయన సూచించారు.

కాగా, గత వారం ఐఎంఎఫ్ చీఫ్ ఎకానమిస్ట్ గీతా గోపీనాథ్ మాట్లాడుతూ, ఇండియాలో ఆర్థిక మందగమనం మాంద్యంగా మారడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ వచ్చే నెలలో విడుదల కానున్న నేపథ్యంలో, భారత వృద్ధి రేటు అంచనాలు మరింతగా పడిపోవచ్చని ఈ రంగంలోని నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ లో వెల్లడైన ఐఎంఎఫ్ అంచనాల మేరకు ఈ సంవత్సరం భారత ఆర్థిక వృద్ధి రేటు 6.1 శాతం మాత్రమే కాగా, వచ్చే సంవత్సరం అది 7 శాతం వరకూ పెరగవచ్చని అంచనా వేసింది.

ఇదిలావుండగా, గడచిన ఆరు సంవత్సరాల వ్యవధిలోనే అత్యంత కనిష్ఠంగా జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 4.5 శాతానికి పతనమైన సంగతి తెలిసిందే. 2018-19 సంవత్సరంలో ఇదే సమయంలో గణాంకాలతో పోలిస్తే, 70 శాతం వరకూ తగ్గింది. భారత ప్రభుత్వం సంస్కరణల అజెండాను మరింత ముందుకు తీసుకు వెళ్లాలని, ఫైనాన్షియల్, హెల్త్ సెక్టార్లపై దృష్టిని సారించాలని సల్ గాడో సలహా ఇచ్చారు.