నన్ను రష్యన్ వేశ్యనన్నారు... ఓ నిర్మాత వేధించాడు: బాలీవుడ్ హీరోయిన్ కల్కి కొచ్లిన్ సంచలన ఆరోపణ!

24-12-2019 Tue 10:12
  • 'యే జవానీ హై దివానీ'లో నటించిన కల్కి
  • సినిమా కోసం పిలిచిన నిర్మాత డేటింగ్ కు రమ్మన్నాడు
  • ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్కి

2013లో విడుదలై సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన 'యే జవానీ హై దివానీ'లో నటించి పేరు తెచ్చుకున్న బాలీవుడ్ నటి కల్చి కొచ్లిన్, ఓ నిర్మాతపై సంచలన ఆరోపణలు చేసింది. అతను తనను లైంగికంగా వేధించాడని, తనతో పాటు డేట్ కు రావాలని పరోక్షంగా అడిగాడని ఆరోపించింది.

ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన తరువాత కూడా తనకు 9 నెలల పాటు ఎటువంటి అవకాశాలూ రాలేదని చెప్పింది. ఆ సమయంలో ఓ నిర్మాత తనను సినిమా కోసం కలిశాడని, అతనితో వెళ్లేందుకు అంగీకరించక పోవడంతో, తనను వద్దనుకున్నాడని చెప్పింది.

ఈ విషయాన్ని తన స్నేహితుడితో చెబితే, ఇది బాలీవుడ్ లో సర్వసాధారణమని చెప్పారని వాపోయింది. 'దేవ్ డీ' చిత్రంలో తనను చూసిన కొందరు రష్యా నుంచి వచ్చిన వేశ్యగా అభివర్ణించారని, తాను రష్యన్ ను కాదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని కొచ్లిన్ పేర్కొంది. కాగా, 'దేవ్ డీ' సినిమాలో ఆమె ఓ వేశ్య పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ నిర్మించిన 'సేక్రెడ్ గేమ్స్'లో నటించిన ఆమె, త్వరలోనే తల్లి కాబోతోంది.