Jharkhand: ఈ విజయం ఎంతో ప్రత్యేకమన్న సోనియా గాంధీ... ఝార్ఖండ్ ఫైనల్ ఫిగర్స్ ఇవిగో!

  • విభజన రాజకీయాలకు చెంపపెట్టు
  • ఆర్జేడీ కూడా ప్రభుత్వంలో భాగం
  • రాష్ట్ర ప్రజలకు మోదీ కృతజ్ఞతలు

ఝార్ఖండ్ లో ఏర్పాటు కానున్న నూతన ప్రభుత్వంలో ఆర్జేడీ కూడా భాగమవుతుందని సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఈ విజయం యూపీఏ కూటమికి ఎంతో ప్రత్యేకమని అన్నారు. బీజేపీ విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. సంఘాన్ని కులాలు, మతాల వారీగా విడగొట్టి పాలించాలన్న ఆలోచనకు ఇది చెంపపెట్టని అన్నారు.

కాగా, మొత్తం 81 సీట్లున్న ఝార్ఖండ్ అసెంబ్లీలో అన్ని నియోజకవర్గాల ఫలితాలూ అధికారికంగా వెల్లడయ్యాయి. 2014 ఎన్నికల్లో గెలిచి అధికారాన్ని ఐదేళ్లపాటు అనుభవించిన బీజేపీ 25 సీట్లకు పరిమితం కాగా, జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి 47 సీట్లు, (జేఎంఎం 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1), జేవీఎం 3, ఏజేఎస్యూ 2, సీపీఐ 1, ఎన్సీపీ 1, స్వతంత్రులకు 2 సీట్లు దక్కాయి.

ఇదిలావుండగా, రాష్ట్ర ప్రజలు తమకు ఎన్నో సంవత్సరాల పాటు పాలించేందుకు అవకాశాన్ని అందించారని, అందుకు కృతజ్ఞతలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఎంతో శ్రమించారని, ఇకపై బాధ్యతగల విపక్షంగా ప్రజల సంక్షేమానికి, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు తమ పార్టీ నేతలు కృషి చేస్తారని అన్నారు.

More Telugu News