తెలంగాణలో ఒకే రోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు లంచగొండి ఉద్యోగులు

24-12-2019 Tue 09:22
  • హైదరాబాద్‌లో ఇద్దరు.. వరంగల్‌లో ఒకరు
  • ఆన్‌లైన్‌లో పేరు నమోదుకు రూ.40 వేలు లంచం అడిగిన కంప్యూటర్ ఆపరేటర్
  • జీఎస్టీలో పేరు నమోదుకు రూ.5 వేలు లంచం అడిగిన ఉప వాణిజ్య పన్నుల అధికారిణి

అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేస్తున్నా లంచగొండి అధికారులు మాత్రం తీరు మార్చుకోవడం లేదు. తెలంగాణలో ఒకే రోజు ముగ్గురు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. తన భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు రూ.40 వేలు లంచం అడిగి తీసుకుంటున్న గండిమైసమ్మ దుండిగల్ తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆపరేటర్ వై.నరేందర్‌రెడ్డి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నరేందర్‌రెడ్డి గతంలో మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు కులధ్రువీకరణ పత్రం జారీ విషయంలో కేసు నమోదైంది. ఈ కేసులో ఇటీవల అతడిని అరెస్ట్ చేసిన అధికారులు జైలుకు పంపారు. అయితే, జైలు నుంచి విడుదలయ్యాక కూడా బుద్ధి మార్చుకోకపోవడంతో మరోమారు ఏసీబీకి చిక్కాడు.

 సికింద్రాబాద్‌లోని మౌలాలికి చెందిన గ్యార రాజకుమార్ అనే వ్యక్తి జీఎస్టీలోని తన చిరునామా మార్చాలని నాచారంలోని సర్కిల్-2 ఉప వాణిజ్య పన్నుల అధికారి ధీరావత్ సరోజను కలిశాడు. అడ్రస్ మార్చేందుకు ఆమె రూ.5 వేల లంచం డిమాండ్ చేయగా, అది పుచ్చుకుంటూ ఏసీబీ అధికారులుకు నిలువునా దొరికిపోయింది.

మరో ఘటనలో వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు ఇన్‌చార్జ్ గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) రైతు నుంచి రూ.7500  లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్చేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసి, చివరికి రూ. 7,500కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మొత్తం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.