నేడు తండ్రి సమాధి వద్దకు వైఎస్ జగన్... కడప జిల్లాలో రెండో రోజు పర్యటన వివరాలు!

24-12-2019 Tue 08:39
  • కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయకు
  • నివాళుల అనంతరం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు
  • మధ్యాహ్నం రాయచోటిలో పలు శంకుస్థాపనలు

కడప జిల్లాలో తన రెండో రోజు పర్యటనలో భాగంగా ఏపీ సీఎం వైఎస్ జగన్, నేడు ఇడుపులపాయలో ఉన్న తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధిని సందర్శించనున్నారు. ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకునే జగన్, అక్కడ నివాళులు అర్పించనున్నారు.

ఆపై మధ్యాహ్నం 12 గంటల వరకూ అక్కడికి సమీపంలోనే ఉన్న చర్చిలో జరిగే ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు రాయచోటి చేరుకుని, అక్కడి జూనియర్ కాలేజీ ఆవరణలో రూ. 3 వేల కోట్ల అంచనాతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడ నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం సాయంత్రం 5 గంటలకు తిరిగి పులివెందులకు చేరుకుని, అక్కడే రాత్రికి బస చేస్తారు. రేపు కూడా జగన్ పర్యటన కడప జిల్లాలోనే సాగనుంది.