బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడికి దేహశుద్ధి.. ఏలూరులో ఘటన

24-12-2019 Tue 08:25
  • ఐదో తరగతి విద్యార్థినులతో అసభ్య ప్రవర్తన
  • తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసిన బాలికలు
  • పోక్సో చట్టం కింద రెండు కేసులు నమోదు చేసిన పోలీసులు

విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కూరపాటి కిశోర్ స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయుడు. ఐదో తరగతి బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న కిశోర్.. నిన్న కూడా తన వక్రబుద్ధిని ప్రదర్శించాడు.

మధ్యాహ్న భోజన సమయంలో ఇంటికెళ్లిన బాలికలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. ఆగ్రహంతో పాఠశాలకు చేరుకున్న బాధిత బాలికల తల్లిదండ్రులు కిశోర్‌ను ప్రశ్నించి దేహశుద్ధి చేశారు. స్థానికుల ఫిర్యాదుతో కిశోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.