మీరు ధరించే దుస్తులే మీరెవరో చెప్పేస్తున్నాయి: మోదీపై విరుచుకుపడిన రాహుల్

24-12-2019 Tue 07:55
  • రూ. 2 కోట్ల సూట్ ధరించే మీరేంటో దేశ ప్రజలకు తెలుసు
  • శత్రువులకు కూడా సాధ్యం కానంతగా దేశ ఆర్థిక వ్యవస్థను చిదిమేశారు
  • లాఠీచార్జీ చేసి, కాల్పులు జరిపి దేశం గొంతు నొక్కుతున్నారు

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో కాంగ్రెస్ నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

నిరసనకారులు ఎవరో వారు ధరించే దుస్తులను బట్టే చెప్పొచ్చంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు రాహుల్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.  మోదీ ధరించే దుస్తులను బట్టే ఆయనేంటో అర్థమైపోతుందన్నారు. ‘‘రెండు కోట్ల రూపాయల విలువైన సూట్ ధరించే మీరేంటో దేశ ప్రజలకు తెలుసు. సామాన్యులు ధరించలేని దుస్తులు అవి’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

అంతేకాదు, శత్రువులకు కూడా సాధ్యం కానంతగా దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారని రాహుల్ దుయ్యబట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకు శత్రువులు చాలా ప్రయత్నాలు చేసినా సఫలం కాలేకపోయారని, కానీ మోదీ ఆ పని చేసేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులపై కాల్పులు జరిపి, లాఠీచార్జీలు చేసి, జర్నలిస్టులను బెదిరించడం ద్వారా దేశం గొంతు నొక్కేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని రాహుల్ విరుచుకుపడ్డారు.