Jharkhand Assembly Election: ఝార్ఖండ్ విచిత్రం: సీఎంగా ఉండి మళ్లీ గెలిచిన వారే లేరు!

  • రాష్ట్రానికి సీఎంలైనా ఆరుగురు మళ్లీ గెలవలేదు
  • తాజా ఎన్నికల్లో సీఎం రఘుబర్ ఓటమి
  • ఓటమి పొందిన ఆరుగురు మంత్రులు, స్పీకర్

ఝార్ఖండ్ లో ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క ముఖ్యమంత్రి మరోమారు సీఎం కాలేకపోయారు. 2000 సంవత్సరంలో ఏర్పడ్డ ఝార్ఖండ్ ను ఈ పందొమ్మిదేళ్లలో ఆరుగురు ముఖ్యమంత్రులు పాలించారు. ఈ కాలంలో మూడు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తాజాగా జరిగినవి నాలుగో అసెంబ్లీ ఎన్నికలు. అధికారంలో ఉండి కూడా ఎన్నికల్లో రెండోమారు గెలిచి సీఎం అయిన వారు లేరు. అదే బాటలో ప్రస్తుత సీఎం రఘుబర్ దాస్ కొనసాగారు. బాబులాల్ మరాండి, అర్జున్ ముండా, శిబుసోరెన్, మధు కోడా, హేమంత్ సొరెన్, రఘుబర్ దాస్ లు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. వీరిలో ఎవరూ కూడా వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో గెలుపొందలేదు.

 ఓటమి పాలయిన ఆరుగురు మంత్రులు

అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ కంగుతింది. పార్టీకి చెందిన మహామహులందరూ ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి, ఆరుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. జంషెడ్ పూర్ తూర్పు నియోజకవర్గంలో పోటీచేసిన ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ స్వంతంత్ర అభ్యర్థి సరయిరాయ్ చేతిలో ఎనిమిదివేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మంత్రిగా పనిచేసిన రాయ్ కు అధికార బీజేపీ టికెట్ నిరాకరించడంతో తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగి సత్తా నిరూపించుకున్నారు. ఓటమి పాలైన వారిలో సీఎం సహా ఆరుగురు మంత్రులు, స్పీకర్ ఉన్నారు. ఫలితాల అనంతరం రఘుబర్ దాస్ మాట్లాడుతూ.. ‘ఈ ఓటమి పార్టీది కాదు. నాదే ఓటమి’ అని అన్నారు.

More Telugu News