‘నవరత్నాలు’కు ఆశపడి తప్పు చేశామని ప్రజలే అంటున్నారు: టీడీపీ నాయకురాలు రేవతి చౌదరి

23-12-2019 Mon 20:18
  • టీడీపీ అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు అబద్ధం
  • అవినీతి గురించి వైసీపీనా మాట్లాడేది!
  • మంత్రులే మూర్ఖులవడంతో గందరగోళం నెలకొంది

‘నవరత్నాలు’కు ఆశపడి తప్పు చేశామని ప్రజలే అంటున్నారని టీడీపీ అధికార ప్రతినిధి రేవతి చౌదరి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, వైసీపీ అధికారంలోకి వచ్చాక .. ఇసుక కొరత ఏర్పడటం, ఉల్లిపాయల కోసం క్యూలో నిలబడి ప్రజలు మృతి చెందడం తప్ప సాధించిందేమీ లేదని విమర్శించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్టణాన్ని ఎన్నుకోవడం వెనుక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పాత్ర చాలా ఉందని అన్నారు. అక్కడ భూములన్నీ వాళ్లే కొన్నారని, అసలు, ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందే వాళ్ల దగ్గర అంటూ వైసీపీ నేతలపై విమర్శలు చేశారు.

 అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, టీడీపీ అవినీతికి పాల్పడిందంటూ డప్పు కొట్టుకుంటూ ఆరోపణలు చేయడం కాదు వాటిని ఆధారాలతో సహా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మంత్రులే మూర్ఖులవడం కారణంగా రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, అస్తవ్యస్త పరిపాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలు, అరాచకం అనే పదాలను ఉచ్చరించే అర్హత కూడా వైసీపీ నేతలు ఎవ్వరికీ లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.