Bumrah: జట్టులోకి తిరిగొచ్చిన బుమ్రా, ధావన్... శ్రీలంక, ఆసీస్ తో సిరీస్ లకు టీమిండియా ఎంపిక

  • జనవరి 5 నుంచి శ్రీలంకతో టి20లు
  • జనవరి 14 నుంచి ఆసీస్ తో వన్డే సిరీస్
  • రెండు సిరీస్ లకు వేర్వేరు జట్ల ఎంపిక

వరల్డ్ కప్ తర్వాత గాయాలపాలైన టీమిండియా పేస్ సంచలనం జస్ప్రీత్ బుమ్రా పునరామగనం చేశాడు. ఇంగ్లాండ్ లో వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వెస్టిండీస్ పర్యటనలో మ్యాచ్ లు ఆడిన బుమ్రా ఆ సిరీస్ తర్వాత మళ్లీ ఆడలేదు. గాయం నుంచి కోలుకున్న ఈ స్పీడ్ స్టర్ ను సెలెక్టర్లు త్వరలోనే శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో జరగబోయే సిరీస్ లకు ఎంపిక చేశారు.

కొన్నాళ్లుగా గాయంతో సతమతమవుతున్న ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఫిట్ నెస్ సాధించడంతో తిరిగి జట్టులోకి వచ్చాడు. తాజాగా విండీస్ తో సిరీస్ ముగించిన టీమిండియా వచ్చే ఏడాది జనవరి 5 నుంచి శ్రీలంకతో మూడు టి20 మ్యాచ్ లు ఆడనుంది. ఆపై, జనవరి 14 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడతారు. ఈ రెండు పర్యటనల కోసం వేర్వేరుగా జట్లను ప్రకటించారు.

చాహర్ గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడి స్థానంలో జట్టులోకొచ్చిన యువ పేసర్ నవదీప్ సైనీపై సెలెక్టర్లు నమ్మకం ఉంచారు. కాగా, శ్రీలంకతో టి20 సిరీస్ కు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు సెలెక్టర్లు విశ్రాంతి కల్పించారు. వరల్డ్ కప్ నుంచి రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో విరామం లేకుండా క్రికెట్ ఆడుతుండడమే అందుకు కారణం. కాగా, టీ20 సిరీస్ కోసం సంజు శాంసన్ ను మరోసారి ఎంపిక చేశారు. అయితే ఈసారైనా అతడికి తుదిజట్టులో అవకాశం దక్కడంపై సందేహాలున్నాయి.

టీమిండియా (శ్రీలంకతో టి20 సిరీస్ కోసం): విరాట్ కోహ్లీ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, శివం దూబే, మనీష్ పాండే, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్.

టీమిండియా (ఆసీస్ తో వన్డే సిరీస్ కోసం): విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, శివం దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్.

More Telugu News