చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారు: మంత్రి బొత్స

23-12-2019 Mon 18:53
  • అమరావతిలోనే అన్నీ ఉండాలని కొందరు ఆందోళనలు చేస్తున్నారు
  • హైదరాబాద్ అభివృద్ధి చెందింది అసెంబ్లీ, సెక్రటేరియట్ వల్ల కాదన్నారుగా
  • చంద్రబాబు ఇప్పుడు ఆందోళనలు ఎందుకు చేయడం?

రాజధానికి భూములిచ్చిన రైతులకు ఇంతకుముందు ఇచ్చిన హామీ ప్రకారం వాటిని అభివృద్ధి పరిచి ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు స్పష్టం చేశారు. విశాఖపట్టణంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జీఎన్ రావు నిపుణుల కమిటీ నివేదికపై ఈ నెల 27న కేబినెట్ భేటీలో చర్చించి తుదినిర్ణయం రాబోతున్న తరుణంలో రాజధాని ప్రాంత రైతుల పేరిట కొందరు ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. ఈ ఆందోళనల గురించి రెండు పత్రికలు, రెండు ఛానెల్స్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

అమరావతిలోనే అన్నీ ఉండాలని కోరుతూ ఆ ప్రాంతంలో కొందరు ఆందోళనలు చేస్తుంటే అక్కడికి చంద్రబాబునాయుడు వెళ్లి మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధి చెందింది అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టుల వల్ల కాదని, ఔటర్ రింగ్ రోడ్డు, ఐటీ వచ్చిన తర్వాతే అభివృద్ధి చెందిందని వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విషయమై ఎవరైతే ఆందోళనలు చేస్తున్నారో వాళ్లు ఆలోచించుకోవాలని సూచించారు.