Netaji: ఆయన నేతాజీ కాదు... నేతాజీ అనుచరుడు మాత్రమే: జస్టిస్ సహాయ్ కమిషన్

  • నేతాజీ ఏమయ్యారన్నదానిపై భిన్నవాదనలు
  • గుమ్నామీ బాబానే నేతాజీ అంటూ విస్తృతప్రచారం
  • కాదని తేల్చిన జస్టిస్ సహాయ్

బ్రిటీష్ పాలకుల కబంధ హస్తాల నుంచి భరతమాతను విముక్తురాలిని చేయాలని పరితపించినవారిలో సుభాష్ చంద్రబోస్ ముందువరుసలో ఉంటారు. ఆయన ఏమయ్యారన్నది ఇప్పటికీ చాలామందిలో సందేహాలు రేకెత్తిస్తూ ఉంటుంది. అయితే, అయోధ్య (అప్పటి ఫైజాబాద్)లో నివసించిన గుమ్నామీ బాబానే సుభాష్ చంద్రబోస్ అని ఓ దశలో తీవ్ర ప్రచారం జరిగింది. వృద్ధాప్యంలో బోస్ ఎలా ఉంటాడో గుమ్నామీ బాబా రూపురేఖలు అలా ఉండడంతో మిస్టరీ వీడినట్టేనని అందరూ భావించారు.

ఈ నేపథ్యంలో, దీంట్లో నిగ్గు తేల్చేందుకు 2016లో యూపీ సర్కారు జస్టిస్ విష్ణు సహాయ్ కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన నివేదికను జస్టిస్ సహాయ్ కొన్నిరోజుల క్రితం యూపీ అసెంబ్లీ ముందుంచారు. ఆ నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.  

అందరూ భావిస్తున్నట్టుగా గుమ్నామీ బాబా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాదని ఆ ఏకసభ్య కమిషన్ స్పష్టం చేసింది. గుమ్నామీ బాబా అప్పట్లో నేతాజీకి అనుచరుడిగా వ్యవహరించారంటూ అందుకు తగిన ఆధారాలను కూడా కమిషన్ వెల్లడించింది. అయితే, నేతాజీ గొంతులాగా గుమ్నామీ బాబా కంఠస్వరం కూడా గంభీరంగా ఉండేదన్న ఒక్క పోలిక తప్ప ఇరువురి మధ్య సామ్యమే లేదని స్పష్టం చేసింది. కాగా, అయోధ్య ప్రాంతంలో తనను అందరూ నేతాజీగా భావిస్తుండడంతో గుమ్నామీ బాబా తన నివాసాన్ని అక్కడి నుంచి మార్చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు.

More Telugu News