Chandrababu: ఆ జీఎన్ రావు నా దగ్గర పనిచేసిన ఆఫీసరే: చంద్రబాబు

  • తుళ్లూరులో రైతుల ధర్నా
  • హాజరైన చంద్రబాబు
  • సర్కారుపై విమర్శలు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు తుళ్లూరులో రైతులు, వారి కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న మహాధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తూ, రాష్ట్రంలో ఎవరూ కోరకపోయినా, జీఎన్ రావు కమిటీ వేశారని, ఆ జీఎన్ రావు తన వద్ద పనిచేసిన అధికారేనని చంద్రబాబు వెల్లడించారు. జీఎన్ రావు కమిటీకి ఉన్న అర్హత ఏంటి? ఆయనలో మనకు తెలియని సబ్జెక్టు ఏంటని ప్రశ్నించారు.

"రాజధాని గురించి ఆయన ఎవరిని అడిగారు, అసలు ఆయన విశ్వసనీయత ఏంటి? జీఎన్ రావు కమిటీ వేసి, మూడు రాజధానులు ఉంటాయని అసెంబ్లీలో ముందుగా ప్రకటిస్తారు. అంటే, జీఎన్ రావు నివేదిక ఇవ్వకముందే ముఖ్యమంత్రిగారు పేపర్ లీక్ చేశారు.  ఆ తర్వాత పరీక్షలు జీఎన్ రావు రాశాడు. ఏం చెప్పాలి తమ్ముళ్లూ, వీళ్లు ఎంత తెలివైనవాళ్లనాలి. జీఎవ్ రావు నివేదిక ఇచ్చాడంటే ఇక్కడెవరూ నమ్మరు. అది జగన్ రిపోర్టు. ఆ రిపోర్టును మన గొంతు కోయడానికి మనమీద ప్రయోగిస్తున్నారు" అంటూ నిప్పులు చెరిగారు.

అంతేకాదు, ఏపీ ప్రభుత్వం రాజధానిగా ప్రతిపాదిస్తున్న విశాఖ నగరంపైనా చంద్రబాబు స్పందించారు. తనకు విశాఖ అంటే ఎంతో ఇష్టమని, అది మంచివాళ్లుండే నగరం అని అన్నారు. విశాఖ ప్రజల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ వ్యతిరేకం కాదని, కానీ అమరావతిలో రైతులకు ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. విశాఖను నాలెడ్జ్ హబ్ గా, ఐటీ రాజధానిగా తీర్చిదిద్దాలని ప్రయత్నాలు చేశామని, కానీ అన్నింటిని అడ్డుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అరకు, ఇతర ప్రాంతాల అభివృద్ధికి కూడా తాము చర్యలు తీసుకున్నామని, అరకులో కాఫీ పండించి ఎగుమతులను ప్రోత్సహించామని తెలిపారు. ఇక్కడికి వచ్చిన ప్రధానికి ఆ కాఫీ గింజలతో తయారుచేసిన కాఫీని తానే సర్వ్ చేశానని చంద్రబాబు వెల్లడించారు.

More Telugu News