హైదరాబాద్ అయినా హైటెక్ సిటీ వచ్చిన తర్వాతే అభివృద్ధి చెందింది: చంద్రబాబు

23-12-2019 Mon 16:18
  • తుళ్లూరులో రైతుల మహాధర్నా
  • హాజరైన చంద్రబాబు
  • రాజధాని రైతులకు సంఘీభావం

రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు వద్ద రైతులు, వారి కుటుంబసభ్యులు నిర్వహిస్తున్న మహాధర్నాలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. రైతులకు సంఘీభావం ప్రకటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతులు ఇచ్చిన భూమిలో రాజధాని అవసరాలు పోను 10 వేల ఎకరాలు మిగులుతుందని, దాన్ని రైతులకే గృహనిర్మాణ అవసరాల నిమిత్తం ఇచ్చే ఏర్పాట్లు చేశామని తమ హయాంలో జరిగిన పరిణామాలను వెల్లడించారు.

రాష్ట్రం నుంచి ఎవరైనా వచ్చిన పక్షంలో వారికి ఓ 500 ఎకరాలు రిజర్వ్ చేసుకున్న పక్షంలో 50 వేలమందికి నివాసాలు ఏర్పరిచే అవకాశం ఉంటుందని వివరించారు. ఆ తర్వాత ఇక్కడ ఉండే భూమిపై వచ్చే ఆదాయం ద్వారా, ఒక్క రూపాయి ఖర్చుపెట్టకుండా, ప్రభుత్వ నిధులతో పనిలేకుండా రాజధాని నిర్మించేలా ఆరోజు ప్రణాళికలు రచించడమే తాము ఆరోజు చేసిన పని అని చంద్రబాబు వివరించారు. అలాంటి ప్రజా రాజధాని అమరావతి అని, దీన్ని పూర్తిగా దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు.

కేవలం పరిపాలన వల్లే అభివృద్ధి జరగదని, హైకోర్టు వల్ల, సచివాలయం వల్ల, అసెంబ్లీ వల్ల అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. హైదరాబాదులో ఇవన్నీ తరతరాల నుంచి ఉన్నా, హైటెక్ సిటీ వచ్చిన తర్వాతే అభివృద్ధి జరిగిందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, ఒక సైబర్ సిటీ, ఒక అవుటర్ రింగ్ రోడ్డు వచ్చిన తర్వాత అభివృద్ధి ప్రారంభమైందని అన్నారు. అభివృద్ధి అంటే సంపద సృష్టించడమేనని, సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుందని తెలిపారు.