వేరే ఇంట్లో ఏదో జరిగితే మనకెందుకులే అన్నట్టుగా ఉండరాదు: నందమూరి సుహాసిని

23-12-2019 Mon 16:10
  • మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రతి ఒక్కరూ స్పందించాలి
  • మహిళల రక్షణపై అందరూ బాధ్యత తీసుకోవాలి
  • రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో సుహాసిని వ్యాఖ్యలు

సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలు, దాడులపై ప్రతి ఒక్కరూ స్పందించాలని టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని అన్నారు. వేరే ఇంట్లో ఏదో జరిగితే మనకెందుకులే అన్నట్టుగా ఉండరాదని చెప్పారు. ఆడపిల్లలు, మహిళల రక్షణ గురించి అందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ భవన్ లో ఈరోజు 'మహిళా నీకేది రక్షణ' అనే అంశంపై తెలంగాణ టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. స్త్రీజాతి రక్షణ కోసం ఎలాంటి విధానాలను అమలు చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ, పైవ్యాఖ్యలు చేశారు.