'కరకట్ట కమల్ హాసన్' అంటూ ఎమ్మెల్యే ఆర్కేపై టీడీపీ వ్యంగ్యం!

23-12-2019 Mon 15:11
  • ఎమ్మెల్యే కనిపించడంలేదని ఫిర్యాదు చేసిన రైతులు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ
  • రైతులకు మద్దతుగా పోస్టు

మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) కనిపించడంలేదంటూ అమరావతి రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజధానిపై అయోమయం నెలకొన్న కారణంగా తాము రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు చేస్తున్నా ఎమ్మెల్యే ఆర్కే ఇంతవరకు స్పందించలేదంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ తన సోషల్ మీడియా ఖాతాలో ఆసక్తికరంగా పోస్టు చేసింది.

'కరకట్ట కమల్ హాసన్ కనబడుటలేదట' అంటూ ఆ పోస్టులో వ్యంగ్యం ప్రదర్శించారు. ఆ ఫొటోలో ఎమ్మెల్యే ఆర్కే ఓ మేకతో కనిపిస్తున్నారు. దీనిపై టీడీపీ స్పందిస్తూ, ఓట్లకోసం ఎమ్మెల్యే తమ చుట్టూ కాళ్లరిగేలా తిరిగి, గెలిచిన తర్వాత బాధలు చెప్పుకుందామంటే కనిపించడం లేదని ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించింది. అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యే ఆచూకీ లేకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొంది.