Jagan: అదే చంద్రబాబుకు, నాకూ ఉన్న తేడా: వైఎస్ జగన్

  • నాలుగున్నరేళ్లు టైమ్ పాస్ చేసిన చంద్రబాబు
  • ఎన్నికలకు ఆరు నెలల ముందు కొబ్బరికాయ
  • అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే శంకుస్థాపన
  • బాబులోని మోసానికి, తనలోని చిత్తశుద్ధికీ తేడా అదేనన్న జగన్

ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబునాయుడు నాలుగున్నరేళ్లు టైమ్ పాస్ చేసి, ఎన్నికలకు ఆరు నెలల ముందు కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీకి కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారని, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల కాలంలోనే స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశానని ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం కడప జిల్లాలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు.

చంద్రబాబులోని మోసపూరిత గుణాన్ని, తనలో ఉన్న చిత్తశుద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. చంద్రబాబు ఏ విధమైన అనుమతులు తీసుకోకుండానే కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారని, వైఎస్ఆర్ ప్రభుత్వం, ప్లాంట్ కు కావాల్సిన నీరు, ముడి ఇనుము తదితర అన్ని సౌకర్యాల కల్పనకూ సంబంధిత విభాగాలు, కంపెనీల నుంచి అనుమతులు తెచ్చిందని స్పష్టం చేశారు. ఈ కర్మాగారాన్ని మూడు సంవత్సరాల వ్యవధిలోనే పూర్తి చేస్తామని, ఆపై 27 వేలకు పైగా ఉద్యోగాలు స్థానికులకు వస్తాయని హామీ ఇచ్చారు. రూ. 15 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు జగన్ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ప్లాంట్ నుంచి సాలీనా 30 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తులు తయారవుతాయని, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఉజ్వలంగా అభివృద్ధి చెందుతుందని జగన్ వ్యాఖ్యానించారు. ముడి ఇనుము సరఫరా కోసం ఎన్ఎండీసీతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ స్టీల్ ప్లాంట్ ను మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలతో చర్చలు కూడా జరుపుతున్నామని వెల్లడించారు. నేడు తన జీవితంలో మరచిపోలేని రోజుగా మిగులుతుందని, ఉక్కు పరిశ్రమతో ఈ ప్రాంత ప్రజల బతుకులు మారిపోతాయని అన్నారు.

More Telugu News