దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్ జరగలేదు: గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్

23-12-2019 Mon 12:43
  • రీపోస్టుమార్టంకు ఎయిమ్స్ వైద్యుల రాక  
  • మృతదేహాలను వారి కుటుంబసభ్యులు గుర్తించారు
  • శవాలు సగం కుళ్లిపోయాయన్న సూపరింటెండెంట్

దిశ హత్య కేసు నిందితులకు హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో రీపోర్టుమార్టం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ, రీపోస్టుమార్టంకు ఎయిమ్స్ నుంచి నలుగురు వైద్యులు వచ్చారని తెలిపారు. నిందితుల కుటుంబసభ్యులతో కూడా ఎయిమ్స్ వైద్య బృందం మాట్లాడిందని చెప్పారు. మృతదేహాలను వారి కుటుంబసభ్యులు గుర్తించారని తెలిపారు.

వీడియో రికార్డింగ్ మధ్య రీపోస్టుమార్టం జరుగుతోందని గాంధీ సూపరింటెండెంట్ వెల్లడించారు. మొదటి పోస్టుమార్టం సీడీని హైకోర్టుకు సమర్పించామని... రీపోస్టుమార్టం సీడీని కూడా అందజేస్తామని తెలిపారు. రెండు అంబులెన్సుల్లో మృత దేహాలను తరలిస్తామని... వారి కుటుంబసభ్యుల సంతకాలు తీసుకుని మృతదేహాలను అప్పగిస్తామని చెప్పారు. నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్ జరపలేదని.. శవాలు సగం కుళ్లిపోయాయని తెలిపారు.