Virat Kohli: ఆ 30 నిమిషాలు మాత్రమే బ్యాడ్ టైమ్... ఈ ఏడాదంతా భారత క్రికెట్ కు అద్భుతం: విరాట్ కోహ్లీ

  • వరల్డ్ కప్ సెమీస్ ను గుర్తు చేసుకున్న కోహ్లీ
  • భవిష్యత్తులో కొత్త కుర్రాళ్లే కీలక ఆటగాళ్లు
  • ఇండియా నంబర్ వన్ జట్టనిపించుకుందన్న పొలార్డ్

"వరల్డ్ కప్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో 30 నిమిషాల సమయం తప్ప, మిగతా ఏడాదంతా భారత క్రికెట్ అద్భుతంగా నడిచింది" అని కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించారు. వెస్టిండీస్ తో వన్డే సీరీస్ విజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐసీసీ నిర్వహించే పోటీల్లో ట్రోఫీలను గెలుచుకునేందుకు భారత జట్టు నిరంతరం పయత్నిస్తూనే ఉంటుందన్నారు. భారత పేస్ బౌలర్లు ఎలాంటి ప్రత్యర్థినైనా ఎదుర్కోగలరని, స్పిన్నర్లను మించి పేసర్లు రాణించడం శుభ పరిణామమని అన్నారు.

రానున్న రోజుల్లో కొత్త ఆటగాళ్లే భారత క్రికెట్ కు మూల స్తంభాలని, ఒత్తిడిలో వారు ఎలా రాణిస్తారో చూడాల్సి వుందని కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్నటి మ్యాచ్ లో తాను అవుట్ అయిన తరువాత రవీంద్ర జడేజా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదని, శార్దూల్ తో కలిసి మూడు ఓవర్లలోనే మ్యాచ్ ని టర్న్ చేశారని, పెవీలియన్ లో కూర్చుని వారిద్దరి ఆట చూస్తుంటే అద్భుతంగా అనిపించిందని కోహ్లీ వ్యాఖ్యానించారు.

ఇక వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్ స్పందిస్తూ, ఈ సీరీస్ లో తాము అద్భుతంగా ఆడామని, అయితే, ఇండియా నంబర్ వన్ జట్టని మరోసారి నిరూపించుకుందని అన్నారు. విండీస్ జట్టు ప్రదర్శన, పోరాటం తనకెంతో గర్వంగా ఉందని, ముఖ్యంగా హెట్ మేయిర్, హోప్, పూరన్, కాట్రెల్ చక్కగా రాణించారని, రెండు దేశాల మధ్య ఇది మంచి సీరీస్ గా నిలిచిపోతుందని అన్నారు.

More Telugu News