UPA: ఝార్ఖండ్ లో అధికారం కాంగ్రెస్-జేఎంఎం కూటమిదే... 26 సీట్లకు పడిపోయిన బీజేపీ!

  • 44 సీట్లకు పెరిగిన కాంగ్రెస్ కూటమి ఆధిక్యం
  • సీఎంగా ప్రమాణం చేయనున్న హేమంత్ సోరెన్
  • బీజేపీ కొంపముంచిన ఎన్నార్సీ, పౌరసత్వ చట్ట సవరణ

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని భావించినప్పటికీ, ప్రజలు మాత్రం స్పష్టమైన అధికారం వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీల కూటమి ప్రస్తుతం 44 సీట్ల ఆధిక్యంలో ఉండగా, జేవీఎం 3, ఇతరులు 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఒక దశలో 33 సీట్లలో ఆధిక్యంతో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని భావించిన బీజేపీ ఆధిక్యం, ప్రస్తుతం 26కు పడిపోయింది. అతిపెద్ద పార్టీగా జేఎంఎం అవతరించనుంది.

ఇటీవలి పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, అంతకుముందు తెరపైకి వచ్చిన జాతీయ పౌరగణన అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా మారాయి. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఓబీసీ ఓట్ బ్యాంక్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఫర్వాలేదనిపించిన బీజేపీ, ముస్లిం ఓట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనూ వెనుకంజలో ఉంది. ముఖ్యమంత్రిపైనా, ప్రభుత్వంపైనా ఉన్న వ్యతిరేకత కూడా ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందనే చెప్పాలి. ఇక ముస్లిం, ఎస్టీల ఓట్లు కాంగ్రెస్, జేఎంఎం కూటమికి వరంగా మారి అధికారాన్ని దగ్గర చేశాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక తమదే అధికారమన్న అంచనాకు వచ్చేసిన కాంగ్రెస్ కూటమి నేతలు సంబరాల్లో మునిగిపోయారు. మిఠాయిలు పంచుకుని, బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జేఎంఎం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ముందుగా చేసుకున్న ఘట బంధన్ ఒప్పందం ప్రకారం, మాజీ సీఎం హేమంత్ సోరెన్ మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. రెండు చోట్ల నుంచి పోటీ చేసిన ఆయన ఒక స్థానంలో స్పష్టమైన ఆధిక్యంలో గెలుపు దిశగా వెళుతున్నప్పటికీ, రెండో చోట మాత్రం వెనుకంజలో ఉన్నారు.

More Telugu News