Thammineni: ఏపీ భవన్ లో స్పీకర్ తమ్మినేనికి చేదు అనుభవం

  • ఏపీ భవన్ లో బిల్లు కట్టమన్న సిబ్బంది
  • స్టేట్ గెస్టుగా కాకుండా కేటగిరి-1లో వసతి ఏర్పాటు
  • మనస్తాపానికి గురైన తమ్మినేని

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ఢిల్లీలోని ఏపీ భవన్ లో చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే, సతీసమేతంగా ఆయన డెహ్రాడూన్ వెళ్లారు. ఆ పర్యటనను ముగించుకుని శనివారం సాయంత్రం ఆయన ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకున్నారు.

స్వర్ణముఖి బ్లాకులోని 320 నెంబర్ గెస్ట్ రూమ్ ను ఆయనకు కేటాయించారు. నిన్న సాయంత్రం రాష్ట్రానికి తిరిగి వచ్చే సమయంలో ఏపీ భవన్ కు చెందిన ఓ చిరుద్యోగి వచ్చి... సార్, వసతి, భోజనం బిల్లును కట్టండి అని చెప్పారు. దీంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు. రాష్ట్ర అతిథి హోదాలో ఉన్న తనను బిల్లు కట్టమని అడగడమేంటని ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఇదే విషయాన్ని సదరు ఉద్యోగిని తమ్మినేని అడిగారు.

దీనికి సమాధానంగా... అమరావతిలో ఉండే సాధారణ పరిపాలన విభాగం నుంచి మీకు స్టేట్ గెస్టుగా కాకుండా, కేటగిరి-1లో వసతి ఏర్పాటు చేయాలని తమకు ఆదేశాలు వచ్చాయని సదరు ఉద్యోగి తెలిపారు. దీంతో, ముందు బిల్లు కట్టేయండి... తర్వాత సంగతి తాను చూసుకుంటానని తన అంతరంగిక సిబ్బందికి తమ్మినేని చెప్పారు.

ఈ ఘటనపై తమ్మినేని భార్య వాణి కూడా ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అవమానం జరిగిందని ఆమె అన్నారు. స్పీకర్ ని ఇక్కడున్న అధికారులు గౌరవించలేదని అసహనం వ్యక్తం చేశారు.

More Telugu News