అప్పుడలా అన్న మమత.. ఇప్పుడిలా అంటున్నారు: మోదీ విమర్శలు

23-12-2019 Mon 08:48
  • దీదీ.. ఏమైంది మీకు? అంటూ సూటి ప్రశ్న
  • అప్పుడు శరణార్థులను ఆదుకోవాలని.. ఇప్పుడు మాట మారుస్తారా
  • అసెంబీ ఎన్నికల్లో లబ్ధి కోసం వైఖరి మార్చుకున్నారా

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీపై ప్రధాని నరేంద్రమోదీ మండిపడ్డారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిన్న నిర్వహించిన సభలో మోదీ మాట్లాడుతూ.. మమతపై నిప్పులు చెరిగారు. అక్రమ చొరబాటుదారులను కట్టడి చేయాలంటూ గతంలో పార్లమెంటులో కోరిన మమత.. ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్టంపై ఐక్యరాజ్య సమితికి వెళ్తామంటున్నారని దుయ్యబట్టారు.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమ చొరబాటుదారుల విషయంలో మమత తన వైఖరి మార్చుకున్నారని విమర్శించారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆమె మాటమార్చారని ఆరోపించారు. ‘‘దీదీ.. మీకు ఏమైంది?.. ఎందుకు మీ వైఖరి మార్చుకున్నారు? అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేస్తున్నారు?’’ అని ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలపై మీకు నమ్మకం లేదా? అని ప్రధాని సూటిగా ప్రశ్నించారు.