ఆగని కామాంధుల దారుణాలు.. అత్యాచారాలకు తెగబడుతున్న మృగాళ్లు!

23-12-2019 Mon 08:11
  • ఎన్ని చట్టాలు వస్తున్నా కనిపించని మార్పు
  • ఒడిశాలో మతిస్థిమితంలేని పదేళ్ల బాలికపై..
  • చిత్తూరులో మానసిక సమస్యలతో బాధపడుతున్న వివాహితపై అత్యాచారం

అత్యాచారాలు అరికట్టేందుకు ఎన్ని చట్టాలు వస్తున్నా కామాంధుల అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా, ఏపీలోని చిత్తూరు, ఒడిశాలోని ఢెంకనాల్ జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనలు కలకలం రేపాయి. చిత్తూరు జిల్లా యాదమరి మండలానికి చెందిన వివాహిత (32) మానసిక సమస్యలతో బాధపడుతూ నాలుగేళ్లుగా చికిత్స పొందుతోంది. శనివారం ఆమె తన ఇంటి వెనక కూర్చున్న సమయంలో పొరుగింటిలో ఉన్న యువకుడు (35) ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒడిశాలోని ఢెంకనాల్ జిల్లాలోనూ ఇటువంటి ఘటనే జరిగింది. మతిస్థిమితం లేని పదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ నెల 19న ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీధిలో ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్ల ఆశ చూపిన యువకుడు తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.